కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. యాజమాన్యం వైఖరికి నిరసనగా భూనిర్వాసితులు, బాధితులు చేపట్టిన ఆందోళన శుక్రవారం నాటికి నాలుగో రోజుకు చేరింది. ఫ్యాక్టరీ ప్రధాన గేటును దిగ్బంధించిన నిరసనకారులు.. వాహనాల రాకపోకలను పూర్తిగా అడ్డుకోవడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది.
Also Read : ఏపీలో త్వరలోనే క్యాబినెట్ ప్రక్షాళన..? ఆ ఐదుగురు మంత్రులపై వేటు పక్కా..?
పరిశ్రమ ఏర్పాటు కోసం విలువైన భూములను త్యాగం చేసిన రైతులకు ఉపాధి, తగిన నష్టపరిహారం ఇస్తామని చెప్పిన యాజమాన్యం..ఇప్పుడు ఆ హామీలను పూర్తిగా విస్మరించింది. ప్రాథమికంగా కొందరికి ఉద్యోగాలు ఇచ్చినా, ఆ తర్వాత రకరకాల సాకులు చెబుతూ ముందస్తు సమాచారం కూడా లేకుండా వారిని విధుల్లోంచి తొలగించింది. ఉపాధి కల్పిస్తారని భూములిస్తే, తమను ఇలా అన్యాయంగా రోడ్డున పడేయడం దారుణమని నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : పార్టీ ఆఫీస్ లో చంద్రబాబు కీలక భేటీ..!
కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో భారతి సిమెంట్స్ యాజమాన్యం తీవ్ర పక్షపాతం చూపుతోందన్నది ప్రధాన ఆరోపణ. కొందరికి నెలకు రూ.30 వేలు చెల్లిస్తూ, మరికొందరికి మాత్రం రూ.15 వేలతో సరిపెడుతున్నారు. అందరికీ సమాన వేతనాలు ఇవ్వాలని, జీతాలు పెంచాలని ఆరు నెలల క్రితం ధర్నా చేసినందుకు.. యాజమాన్యం కక్షకట్టి అకారణంగా తమను ఉద్యోగాల నుంచి తొలగించిందని బాధితులు వాపోతున్నారు.
Also Read : మోసాద్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఇరాన్.. గేమ్స్ కు చెక్..!
తొలగించిన కార్మికులను తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల వేతనాలు చెల్లించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఫ్యాక్టరీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాజమాన్యం మొండివైఖరి విడనాడి వెంటనే నిర్వాసితులతో చర్చలకు రావాలని, లేనిపక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు.

