నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్‌రోచ్ జనతా పార్టీ గత నెలలో దేశ రాజధానిలో చేపట్టిన విద్యార్థి ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జంతర్ మంతర్ వేదికగా సాగిన ఈ నిరసనలు, పార్లమెంట్ మార్చ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఆందోళన కలిగించాయి. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాల వల్ల పలువురు విద్యార్థులతో పాటు డజన్ల సంఖ్యలో ఢిల్లీ పోలీస్ సిబ్బంది కూడా గాయపడ్డారు.
Also Read : బెజవాడ అలంకార్ థియేటర్ క్రేజీ రికార్డ్..!
ఈ నేపథ్యంలో గాయపడిన పోలీసుల కుటుంబ సభ్యులు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రదర్శనకారుల హింసపై తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ కుమార్తె మాట్లాడుతూ.. నిరసనల సమయంలో తన తండ్రిపై దాదాపు మరణాయుధాలతో దాడి జరిగిందని ఆరోపించారు. ఈ ప్రెస్ మీట్ పై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. విధి నిర్వహణలో గాయపడిన పోలీసు అధికారుల పట్ల తమకు పూర్తి సానుభూతి ఉందని పేర్కొంటూనే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అమాయక విద్యార్థులను పోలీసులు క్రూరంగా కొట్టినప్పుడు వారి కుటుంబాల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
Also Read : భోగాపురంలో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
పోలీసులపై దాడి చేసింది విద్యార్థులు కాదని, నిరసనలను భగ్నం చేయడానికి అధికార బీజేపీ పంపిన గూండాలే ఈ దాడులకు పాల్పడ్డారని దిప్కే సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని విద్యార్థుల గొంతు నొక్కేందుకు పాలకులే ఈ కుట్ర పన్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం విద్యార్థులు చేయకూడదనే ఉద్దేశంతోనే, కావాలనే పాత నేరస్థులను రంగంలోకి దించి ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చారని అభిజీత్ దిప్కే మండిపడ్డారు. ముంబై లేదా బిహార్ ప్రజలు వచ్చి ఢిల్లీలో గొడవలు చేయలేదని, విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడానికే ఈ కుట్ర జరుగుతోందని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని అణచివేయాలని చూస్తే సహించేది లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

