విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఘనంగా ప్రారంభమైంది. విమానాశ్రయం రన్ వే పైన ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణిస్తున్న భారత వాయుసేన విమానం ముందుగా లాండ్ అయ్యింది. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయాన్ని మోదీ పరిశీలించారు. ఆ తర్వాత ఏకంగా రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపన చేశారు.
Also Read : ఆ బౌలర్ టీంలో ఉండాల్సిందే.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!
ఎయిర్ పోర్టు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలి వీణను ప్రధానికి బహుకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ఉత్సాహం అదిరిపోయిందన్నారు. ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్సు అవసరమా అని అవమానించారని.. అలాంటి వారికి ఇదే జవాబు అన్నారు. ఎర్రబస్సు రాని చోటుకు ఇప్పుడు ప్రధాని మోదీ వచ్చారని.. త్వరలో ప్రపంచ పటంలో భోగాపురం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుందన్నారు. కష్టాల్లో ఉన్న ఏపీని ప్రధాని మోదీ కాపాడుతున్నారని.. కేంద్ర నిధులతో ఆక్సిజన్ అందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
Also Read : మోడీని దారుణంగా మాట్లాడారు.. పవన్ సంచలన కామెంట్స్..!
ఉత్తరాంధ్ర అంటే ఇప్పటి వరకు వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉందని.. కానీ ఇక నుంచి ఉత్తరాంధ్ర కాదు.. ఉత్తమాంధ్రగా మారుతుందన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గిపోతాయని.. ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో సరికొత్త చరిత్రకు నాంది పలికామన్నారు. విశాఖకు అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయని.. ఉత్తరాంధ్ర దశ, దిశ పూర్తిగా మారుతున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు వెల్లడించారు. ఉత్తరాంధ్ర వాసులను మోసం చేసేందుకు ఎంతో మంది ప్రయత్నం చేశారని.. అలాంటి వారంతా అడ్రస్ లేకుండా పోయారని పరోక్షంగా వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, అంతర్జాతీయ విమానాశ్రయంతో విశాఖ సహా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. ఉత్తరాంధ్ర కాదు.. ఉత్తమాంధ్ర అని తెలిపిన చంద్రబాబు.. ఇక నుంచి మీరు వెనుకబడిన ప్రాంతం వారు కాదు.. మీరే నంబర్ వన్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

