ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వేస్టేషన్ అందుబాటులోకి రానుంది. విజయవాడ శివారు ప్రాంతంలోని రాయనపాడు రైల్వేస్టేషన్ జూలై 17వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. జూలై 17న రైల్వేస్టేషన్ ప్రారంభించేందుకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్‌పై రద్దీ పడుతున్న నేపథ్యంలో.. ఆ ప్రభావం తగ్గించేందుకు రాయనపాడును శాటిలైట్ స్టేషన్‌గా అభివృద్ధి చేశారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రూ.35 కోట్లతో ఆధునికీకరణ చేపట్టారు. పనులు పూర్తి కావటంతో జూలై 17వ తేదీ రాయనపాడు రైల్వేస్టేషన్ ఆరంభించేందుకు ముహూర్తం ఖరారైంది.
Also Read : తెలంగాణా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం..!
మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రాయనపాడు రైల్వేస్టేషన్‌లో ప్లాట్ ఫామ్‌లు ఆధునీకరించారు. రైలు ప్రయాణికుల కోసం విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. టికెట్ కౌంటర్లు, టాయిలెట్స్ తీర్చిదిద్దారు. ఆర్వో తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. అలాగే రైలు స్టేషన్ మాస్టర్, ఇతర సిబ్బంది కోసం రైల్వేస్టేషన్‌లో గదులు నిర్మించారు. రైల్వేస్టేషన్ ఎంట్రీతో పాటు మొత్తం ప్రాంగణమంతా పచ్చదనం ఉండేలా తీర్చిదిద్దారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే స్థానిక ప్రత్యేకతను ప్రయాణికులకు పరిచయం చేసేలా కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్ వేశారు. మరోవైపు రాయనపాడు రైల్వేస్టేషన్ మీదుగా ప్రస్తుతం రోజూ 12రైళ్ల వరకూ రాకపోకలు సాగిస్తున్నాయి.
Also Read : మళ్లీ బీఆర్ఎస్ వైపు ఈటల అడుగులు.. నిజమేనా..?
రాబోయే రోజుల్లో రాయనపాడు రైల్వేస్టేషన్ మీదుగా మరిన్ని రైళ్లను నడపనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రూ.5.77 కోట్లతో ఆధునిక టాయిలెట్లు, ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ నిర్మించారు. దివ్యాంగుల కోసం మరుగుదొడ్లు నిర్మించారు. రూ.13.33 కోట్లతో ప్లాట్ ఫామ్‌ల ఆధునికీకరణ.. దివ్యాంగులకు అనువుగా టాక్ టైల్ పాత్ ఏర్పాటు చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, రెండు లిఫ్ట్‌లు, రైల్వేస్టేషన్ చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారు. ఆధునిక సదుపాయాలు, హైటెక్ హంగులతో తీర్చిదిద్దిన రాయనపాడు రైల్వేస్టేషన్ జూలై 17న ప్రారంభం కానుంది. ఈ రైల్వేస్టేషన్ అందుబాటులోకి వస్తే విజయవాడ రైల్వేస్టేషన్ మీద ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే వేగంగా పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు.

