ఆంధ్రప్రదేశ్‌లో అడవుల విస్తీర్ణాన్ని పెంచడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో సరికొత్త సాంకేతికతను జోడించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డ్ సెట్ చేస్తున్నారు. తొలుత రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతులు (సీడ్ బాల్స్) తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రజల భాగస్వామ్యంతో అటవీశాఖ ఏకంగా 3.80 కోట్ల సీడ్ బాల్స్ ను సిద్ధం చేసి రికార్డు సృష్టించింది. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా విత్తన బంతులను తయారు చేసి ప్రారంభించిన “హరిత సమరం” ప్రాజెక్టు, ప్రస్తుతం అనుకూలమైన వర్షాకాలం రావడంతో క్షేత్రస్థాయిలో వేగంగా విస్తరిస్తోంది.
Also Read : చంద్రబాబుకు ఉన్న నీటి సోయి… రేవంత్‌కు రావాలి!
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల సీడ్ బాల్స్ ను అటవీ సిబ్బంది, మహిళా సంఘాల ద్వారా నేరుగా మానవ వనరులతో వెదజల్లారు. అయితే మనుషులు చేరుకోలేని దట్టమైన అటవీ లోయలు, నిటారైన కొండ వాలు ప్రాంతాల్లో దేశవాళీ వృక్షాలను తిరిగి మొలకెత్తించడానికి డ్రోన్ ఆపరేషన్లను ముమ్మరం చేశారు. చింతూరు అటవీ డివిజన్ ఆఫీసర్ రవీంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో మొదలైన ఈ ఆపరేషన్ ద్వారా మొదట లక్కవరం రిజర్వ్ ఫారెస్ట్ లో డ్రోన్ల సేవలను వినియోగించారు.
Also Read : సీమలో భూమి బంగారం..! ఎకరా ధర వింటే షాక్..!
కేవలం సాంకేతికతనే కాకుండా స్థానిక పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయని వేప, చింత, నేరేడు, ఉసిరి, అల్లామద్ది, రేల, తాని వంటి వైవిధ్యమైన దేశవాళీ అటవీ విత్తనాలను మాత్రమే ఈ బంతుల తయారీలో వాడటం ఈ ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత. చింతూరు ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని 440.50 హెక్టార్ల క్షీణించిన అటవీ ప్రాంతాలను మళ్లీ దట్టమైన అడవులుగా మార్చడమే లక్ష్యంగా ఈ డ్రోన్ల గగనతల విత్తన పంపిణీ సాగుతోంది. లక్కవరం బ్లాక్ విజయవంతం కావడంతో వాతావరణం, వర్షపాతం మరియు నేల తేమ పరిస్థితులను బట్టి ఈ డ్రోన్ల వినియోగాన్ని కన్సులూరు, మర్రిగూడెం, దేవరపల్లి, రేపాక, వాలి సుగ్రీవ మరియు భద్రాచలం ఫారెస్ట్ బ్లాకులకు అటవీశాఖ దశలవారీగా విస్తరిస్తోంది.

