విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు చివరకు కస్టోడియల్ డెత్ గానే తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక మాజీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.ఎస్.వి.వి. నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. స్థానిక పోలీసుల ప్రభావం దర్యాప్తుపై పడకుండా ఉండేందుకు, అలాగే భద్రతా కారణాల దృష్ట్యా నిందితుడైన సీఐని నెల్లూరు జిల్లా జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అత్యంత షాకింగ్ నిజాలను వెల్లడించింది.
Also Read : నేనే చేసానని గ్యారెంటీ ఏంటి..? సిట్ కు సిఐ నాగరాజు ప్రశ్న..!
సాయికృష్ణ అదృశ్యమయ్యాడని బయటకు నమ్మించే ప్రయత్నం జరిగినప్పటికీ, అది ముమ్మాటికీ పోలీస్ కస్టడీలోనే జరిగిన మరణమని సిట్ స్పష్టం చేసింది. అంతేకాకుండా చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి సీఐ నాగరాజు నేతృత్వంలోనే సాయికృష్ణ మృతదేహాన్ని రహస్యంగా మాయం చేశారని రిపోర్టులో పేర్కొన్నారు. సిట్ అధికారులు ఈ కేసులో ఇప్పటివరకు 17 మంది సాక్షులను సుదీర్ఘంగా ప్రశ్నించి కీలక ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది.
Also Read : ట్రంప్ కు అమెరికా సెనేట్ షాక్.. అధ్యక్షుడి అధికారాలకు కత్తెర..!
సాయికృష్ణ మృతదేహాన్ని తాను పోలీస్ స్టేషన్ లోపలే స్వయంగా చూశానని సదరు ఎస్సై సిట్ అధికారుల ముందు అంగీకరించడంతో సీఐ నాగరాజు అక్రమాలు పూర్తిగా బయటపడ్డాయి. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. జూన్ 6 నుంచి జూన్ 19వ తేదీల మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ దారుణమంతా జరిగింది. సాయికృష్ణపై గతంలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ, నిబంధనల ప్రకారం అతడిని కోర్టులో హాజరుపరచకుండా అక్రమంగా స్టేషన్ లోనే నిర్బంధించి థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్లు తెలుస్తోంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా సమాధానం దొరకకపోవడంతో ఆమె హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతోనే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపగా ఈ ఘోరం వెలుగుచూసింది.

