ఏం జరిగిందో తెలియదు. ఏం జరుగుతుందో కూడా తెలియదు. కాకపోతే పరిస్థితి చూస్తే మాత్రం.. తేడాగానే కనిపిస్తోంది. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. లోపల పరిస్థితులు మాత్రం వేరేగా కనిపిస్తున్నాయి. కడుపులో కత్తులు పెట్టుకుని.. పైకి అంతా నవ్వుతూ మాట్లాడుతున్నారనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. అయితే దీనికి బాధ్యులు ఎవరు అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. ఎవరు కూడా తమకేం తెలియదు అన్నట్టుగా మొహాలు పెడుతున్నారు. కానీ ఇలా పార్టీ ప్రజల్లో పరువు పోగొట్టుకుంటుంటే.. ఆ తదుపరి ఏం జరుగుతుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది ఇదే.
Also Read : మహిళా పోలీసు తీరు సిగ్గు సిగ్గు..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పెద్ద దుమారం చెలరేగింది. ఎన్నికల ముందు నుంచి ఓ మీడియా ఛానల్ కాంగ్రెస్ పార్టీకి అనుకూ లంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుకూలమైన వార్తలు.. ప్రభుత్వానికి సంబంధించిన అడుకూలమైన కథనాలను అది ప్రసారం చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే.. ఆ ఛానల్ ప్రతినిధులే ముందుగా వెళ్లి.. సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు కూడా చెప్పారు. కానీ అలాంటి ఛానల్లో ఇప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇది ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు మహేష్ కుమార్ గౌడ్‌కు పొమ్మన లేక పొగబెడుతున్నారా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్‌కు దగ్గరగా ఉండటం లేదు. ప్రభుత్వ పథకాలను ఆయన ప్రచారం చేయడం లేదు. విదేశాల్లో ఎక్కువ
సమయం ఉంటున్నారు. పార్టీకి సంబంధించిన సామాజిక మాధ్యమాల విభాగాలను కూడా అంతగా శక్తివంతం చేయలేదు. దీంతో భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా రెచ్చిపోతుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని తీవ్రమైన ఇరకాటంలో పెడుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. మహేష్ కుమార్ గౌడ్ పెద్దగా పట్టించుకోవడం లేదని ఆ చానల్లో వరుసగా కథనాలు ప్రసారం అయ్యాయి. ఆ చానల్ యాజమాన్యంలో కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర మిత్రులని తెలుస్తోంది.
Also Read : ఐపీఎల్ లో బిగ్ బాంబ్.. ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్ బై..!
ఇటీవల మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆ ఛానల్ యాజమాన్యానికి సంబంధించిన దగ్గర వ్యక్తికి ఇవ్వలేదని.. అందువల్లే. మహేష్ కుమార్ గౌడ్ మీద ఈ స్థాయిలో నెగిటివ్ వార్తలు ప్రసారం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఆ చానల్ తనపై ప్రసారం చేసిన వ్యతిరేక కథనాల పట్ల స్పందించారు. మీడియా మీద గౌరవం ఉంది కాబట్టి తాను ఏమీ అనలేకపోతున్నా అని.. కాలమే అన్నిటికి సమాధానం చెబుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ చానల్ ప్రసారం చేసిన కథనాన్ని కాస్త పక్కన పెడితే మహేష్ కుమార్ గౌడ్ టీపిసిసి ప్రెసిడెంట్ అవ్వడానికి ముఖ్య కారకుల్లో రేవంత్ రెడ్డి కూడా ఒకరు. పైగా ఇటీవల ఆయన 2034 వరకు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీసీ ముఖ్యమంత్రి అవుతారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డి ఆ ప్రకటన చేసిన తర్వాత.. మహేష్ కుమార్ గౌడ్ బీసీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడం సీఎం రేవంత్ రెడ్డికి నచ్చలేదని తెలుస్తోంది. పైగా కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ఒక వర్గంగా.. రేవంత్ రెడ్డి మరొక వర్గంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది.
అయితే మహేష్ కుమార్ గౌడ్ మీద ఇలాంటి కథనం ప్రసారం కావడం పట్ల కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత పోరు మరోసారి బయటపడింది. దక్షిణ భారతదేశంలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడులో అధికార భాగస్వామి పార్టీగా ఉంది. అయితే కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణనే కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నాయకులు అధిష్టానానికి ఇప్పుడు బలమైన మద్దతు ఇస్తున్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అంతర్గత పోరుతో అసలుకే మోసం తెచ్చుకునే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

