నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తాజాగా జరిగిన ఓ ఘటన సంచలనంగా మారింది. స్థానికంగా ఉన్న మంచినీటి సమస్యను ప్రస్తావించినందుకు, టీడీపీ ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి ఏకంగా తన సొంత పార్టీకి చెందిన ఒక కార్యకర్తపైనే భౌతిక దాడికి దిగారనే వార్త వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ప్రశ్నించిన వారిపై ఇలా ప్రతాపం చూపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : మహిళా పోలీసు తీరు సిగ్గు సిగ్గు..!
కావలి నియోజకవర్గ పరిధిలోని ఒక ప్రాంతంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో, సదరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. “నన్నే ప్రశ్నిస్తావా..?” అంటూ తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి.. ఆ కార్యకర్తపై చేయి చేసుకున్నారని, తీవ్రంగా దూషించారని బాధితుడు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వాస్తవానికి, గత కొన్ని రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిరంగంగానే హెచ్చరించారు.
Also Read : దుమారం రేపుతున్న సీజేఐ వ్యాఖ్యలు.. ఎందుకిలా..!
“అధికారం ఉందని పదిమందిని వెంటేసుకుని తిరగడం కాదు.. దురుసుతనం తగ్గించుకుని అందరినీ కలుపుకుపోవాలి” అని స్వయంగా చంద్రబాబు క్లాస్ పీకారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పనితీరు ర్యాంకింగ్స్ లో కావలి ఎమ్మెల్యే 107వ స్థానంలో ఉన్నారని, ఇదే ఆయనకు చివరి అవకాశం అని కూడా సీఎం స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అంతలా హెచ్చరించిన వారం రోజుల లోపే.. మళ్లీ ఇలా మంచినీటి సమస్యపై నిలదీసిన సొంత పార్టీ కార్యకర్తపైనే ఎమ్మెల్యే భౌతిక దాడికి దిగారనే ఆరోపణలు రావడం కూటమి ప్రభుత్వంలో కలకలం రేపుతోంది.

