రాజకీయాల్లోకి మరో వారసురాలు రెడీ అయ్యారు. తెలంగాణలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మాజీ మంత్రి మల్లారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఓ సాధారణ పాల వ్యాపారి.. వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. ఎంపీగా, మంత్రిగా పని చేశారు. తమ మాట తీరుతో ప్రజలను ఆకట్టుకున్నారు. 2014 మార్చి 19న తెలుగుదేశం పార్టీలో చేరిన మల్లారెడ్డి.. ఏప్రిల్ 9న మల్కాజ్ గిరి లోక్‌సభ నియోజక వర్గం అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎంపీ మల్లారెడ్డి. అయితే ఎన్నికల అనంతరం సరిగ్గా నెల రోజులకే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మేడ్చల్ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మల్లారెడ్డి.. కేసీఆర్ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి శిక్షణ శాఖల మంత్రిగా వ్యవహరించారు.
Also Read : భారత్ కు చమురు గుహలు.. మన వైజాగ్ ఎందుకు కీలకం..?
2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మల్లారెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే పార్టీ ఓడిపోవడంతో.. మల్లారెడ్డి దూకుడుకు బ్రేకులు పడినట్లు అయ్యింది. ఆయనపై కబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన యూనివర్సిటీ పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించినట్లు గుర్తించిన అధికారులు.. కాంపౌండ్ వాల్ కూల్చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఆ సమయంలో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే పుకార్లు కూడా షికారు చేశాయి. కానీ వాటిని మల్లారెడ్డి కొట్టిపారేశారు. ఇప్పుడు మల్లారెడ్డి గురించి మరో వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు, డాక్టర్ ప్రీతి రెడ్డి తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. మల్లారెడ్డి వారసురాలిగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఆమె చురుగ్గా పర్యటిస్తూ, విద్య, వైద్యం, ప్రజల సంక్షేమాన్ని ధ్యేయంగా చేసుకుని ప్రచారం సాగిస్తున్నారు. మల్లారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుండి విరామం తీసుకుంటున్న తరుణంలో, ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారనే మాట బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్‌గా డాక్టర్ ప్రీతి రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆమె కూడా ఒక వైద్యురాలు. కాలేజీ ఫంక్షన్‌లో వేదికపై ఆమె చేసిన డాన్స్ తెగ పాపులర్ అయ్యింది కూడా.
Also Read : కోహ్లీ, రోహిత్ ఫిట్.. గంభీర్ కు ఎన్సీఏ క్లారిటీ..!
మల్కాజ్‌గిరి పరిధిలో ప్రజలతో మమేకమవుతూ, జనబలం పెంచుకుంటున్నారు. ముఖ్యంగా యువత, మహిళలను ఆకర్షించేలా ఆమె కార్యాచరణ ఉంది. ఆమె బీఆర్ఎస్‌లో భాగంగా రాజకీయాలను కొనసాగిస్తున్నారనేది ఆ పార్టీ నేతల మాట. అయితే ఆమె ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ.. “హైదరాబాద్ పేరును భాగ్యనగరం”గా మార్చాలనే ఆలోచనను సమర్ధిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆమె రాజకీయంగా ఏ దిశలో మొగ్గు చూపుతున్నారో చూపిస్తుంది. గతేడాది కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో ఆమె బహిరంగంగా కనిపించారు. దీంతో ఆమె బీజేపీలోకి ప్రవేశించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె రాజకీయ ప్రయాణంలో మరో కీలకమైన అంశం ఏమిటంటే, ఆమె మామ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆమెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆయన ఆమె రాజకీయ ఆశయాలను పూర్తిగా ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో డాక్టర్ ప్రీతిరెడ్డి రాజకీయ ప్రవేశం దాదాపు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డాక్టర్ ప్రీతి రెడ్డి రాజకీయ ఎంట్రీ తెలంగాణలో, ముఖ్యంగా మల్కాజ్‌గిరిలో ఆసక్తికరంగా మారింది. అయితే ఆమె బీఆర్ఎస్‌లోనే కొనసాగుతారా.. లేక బీజేపీలో చేరతారా అనే విషయం తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.

