ఆర్ధిక రాజధాని, రియల్ ఎస్టేట్ రాజధాని, ఆటో మొబైల్ రాజధాని, నూతన రాజధాని ఇలా ఎన్నో ట్యాగ్ నేమ్స్ తో కీర్తించే బెజవాడలో ప్రైవేట్ రంగ అభివృద్ధి మినహా ప్రభుత్వ రంగ అభివృద్ధి పెద్దగా కనపడే పరిస్థితి తక్కువ. భూముల ధరలు భారీగా ఉండటం, వ్యాపార కేంద్రం కావడంతో ప్రైవేట్ పెట్టుబడిదారుల పుణ్యమా అని బెజవాడ అభివృద్ధి దిశగా అడుగులు వేసిందనే వాస్తవాన్ని చాలా మంది అంగీకరిస్తూ ఉంటారు. రాజకీయ పార్టీలకు సైతం వారి వారి రాజకీయ వ్యూహాలకు కేంద్రంగా విరాజిల్లిన బెజవాడ అభివృద్ధిలో ప్రభుత్వాల సహకారం పొందలేదు.
Also Read : ఇమ్రాన్ బ్రతికే ఉన్నారా..? పాక్ రక్షణ శాఖ ఏం అంటోంది..?
దక్షిణాది రాష్ట్రాలకు రైల్వే గేట్ వే గా ఉండే బెజవాడలో ఇప్పుడు పరిస్థితి మారుతోంది. 2014 నుంచి 2019 వరకు మూడు ఫ్లై ఓవర్లు.. 2022 తర్వాత నూతన రాజధాని అమరావతిని, గుంటూరు, గన్నవరంను కలుపుతూ కేంద్రం నిర్మించిన రహదారి.. బెజవాడకు కాస్త ప్లస్ అవుతుండగా.. ఇప్పుడు బెజవాడ వీధుల్లో అభివృద్ధి సంకేతాలు కనపడుతున్నాయి. వైసీపీ హయాంలో కక్ష సాధింపు రాజకీయాలకు వేదిక అయిన బెజవాడలో ఇప్పుడు పరిస్థితి మారుతోంది. గ్రేటర్ విజయవాడ అనే మాట ఈ మధ్య ఎక్కువగా వినపడుతూ వస్తోంది.
ఇప్పుడు నగరంలో రోడ్లు, డ్రైనేజీలు కొత్తగా కనపడుతున్నాయి. నగరంలో మట్టి రోడ్డు అనేది కనపడకూడదు అనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాడిగడప మున్సిపాలిటీ, పెనమలూరు మండలం, బెజవాడ రూరల్, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో కొత్త రోడ్లు దర్శనమిస్తున్నాయి. ప్రతీ గల్లీలో సీసీ రోడ్లు కనపడుతున్నాయి. ఇరుకుగా ఉండే రోడ్లను విస్తరిస్తోంది సర్కార్. పోరంకి – నిడమానూరు రోడ్డు, గాంధీ నగర్, సత్యనారాయణపురం ప్రాంతాలు, కానూరు గ్రామంలో రోడ్డు సహా పలు ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
Also Read : బెజవాడ వాసులకు పారిశుధ్య మోక్షం
ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. ఎవరి ఇల్లు అయినా సరే రోడ్డు విస్తరణలో తొలగించేందుకు వెనక్కు తగ్గడం లేదు. అటు నూతన డ్రైనేజీల నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది. బెజవాడలో ఓపెన్ డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ సంస్కృతికి ముగింపు పలుకుతూ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ప్రభుత్వం నిర్మిస్తోంది. విజయవాడ పరిసరాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఇదే అభివృద్ధి కొనసాగుతోంది. తారు రోడ్లు నిలబడవు అనుకున్న ప్రాంతాల్లో సీసీ రోడ్లతో శాశ్వత పరిష్కారం చూపిస్తోంది సర్కార్. ఇలా బెజవాడ రూపు రేఖలు సైలెంట్ గా మారుతూ కొత్త రూపు సంతరించుకుంటోంది.

