ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు మరింత దగ్గర కావడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2024 లో తొలిసారి అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి జాగ్రత్తగా తన పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
Also Read : టార్గెట్ భారత్ ఏజెంట్లు.. జ్యోతి విచారణలో సంచలనాలు
ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పవన్ కళ్యాణ్ దూకుడు ప్రదర్శించడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనబడుతోంది. మన్యం ప్రాంతంలో ప్రజలకు మరింత దగ్గర కావడానికి పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాలను ఎంచుకున్నారు. దీని ద్వారా జనసేన పార్టీ కూడా క్రమంగా బలోపేతం అవుతుంది. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్.. గతంలో పార్టీ బలోపేతంపై ఎక్కువగా దృష్టి సారించలేదు. ఇప్పుడు మాత్రం క్రమంగా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడమే కాకుండా కొత్త కార్యకర్తలను పార్టీ వైపు ఆకర్షించే దిశగా అడుగులు వేస్తున్నారు.
Also Read : తొలి మహానాడులో ఏం జరిగిందో తెలుసా..?
అభిమానులను కార్యకర్తలుగా మార్చేందుకు పవన్ తీవ్రంగా కష్టపడుతున్నారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు “మన ఊరి కోసం మాటామంతి”అనే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మొదటిరోజు శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామ ప్రజలతో టెక్కలిలోని భవాని థియేటర్ వేదికగా పవన్ కళ్యాణ్ ముచ్చటిస్తారు. తర్వాత విశాఖ జిల్లాలో ఈ కార్యక్రమం జరగనుంది. తద్వారా ప్రజల్లో తన నాయకత్వం పట్ల ఆమోదం తెచ్చుకునేందుకు.. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించి మెప్పు పొందే విధంగా వ్యూహరచన చేస్తున్నారు.