ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఆధ్వర్యంలోని శాఖల్లో పలు వినూత్న చర్యలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ, పర్యావరణ శాఖలను స్వయంగా ఎంపిక చేసుకుని బాధ్యతలు స్వీకరించారు. ఈ శాఖల్లో పరిపాలనా మెరుగుదల, కార్యాచరణ వేగవంతం, ఫలితాలపై దృష్టి సారిస్తూ ప్రత్యేక గుర్తింపును సాధిస్తున్నారు.
తాజాగా వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి అటవీశాఖ ద్వారా కీలక నిర్ణయం అమలు చేశారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో వన్యప్రాణుల కోసం ప్రత్యేక అంబులెన్సులు మరియు వాహనాలను ప్రారంభించారు.
Also Read : వారిని దూరం పెట్టారా..? లేక ఉంటున్నారా..?
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ చేపట్టిన ‘హనుమాన్ ప్రాజెక్ట్’ కింద మొత్తం 100 వాహనాలను కేటాయించారు. ప్రమాదాల్లో గాయపడిన వన్యప్రాణులను తక్షణమే రక్షించడం, మానవ–వన్యప్రాణి ఘర్షణలను తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ఈ అంబులెన్సుల్లో జంతువుల తరలింపుకు హైడ్రాలిక్ లిఫ్టులు, అత్యవసర శస్త్రచికిత్స పరికరాలు, అవసరమైన మందులు, రక్తపరీక్షల కోసం మైక్రోస్కోపులు, రెస్క్యూ గేర్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. క్షేత్రస్థాయిలోనే చికిత్స అందించేందుకు మొబైల్ వెటర్నరీ సేవలను కూడా కల్పించారు.
హనుమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వన్యప్రాణులకు ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించే విధంగా వ్యవస్థను రూపొందించారు. అదేవిధంగా వన్యప్రాణి దాడుల్లో గాయపడిన లేదా మృతి చెందిన వారికి పరిహారం చెల్లింపులో వేగం పెంచారు. గతంలో పరిహారం చెల్లింపులో ఆలస్యాలు ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వన్యప్రాణి దాడుల బాధితులకు సుమారు రూ.4 కోట్ల పరిహారం అందించినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : అన్నా.. మీరే దిక్కు.. మీరే రావాలి..!
ఇది మాత్రమే కాకుండా, అటవీశాఖ అధికారులకు ప్రత్యేక వాహనాలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 19 రాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసి ఈ వాహనాలతో అనుసంధానం చేశారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సమయానుకూల చర్యలు చేపట్టే అవకాశం కలిగింది. వన్యప్రాణుల సంరక్షణ పట్ల తన ప్రత్యేక ఆసక్తిని పవన్ కళ్యాణ్ గతంలో కూడా వ్యక్తపరిచారు. ఇటీవల తన తల్లి అంజనా దేవి జన్మదినం సందర్భంగా విశాఖ జూలో ఒక జంతువును ఏడాది పాటు దత్తత తీసుకోవడం ద్వారా సంరక్షణకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం వన్యప్రాణుల కోసం ప్రత్యేక అంబులెన్సుల ప్రారంభం ద్వారా అటవీశాఖలో సమగ్ర సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

