అమరావతిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టాప్ 5 సిటీగా రూపొందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సీఆర్‌డీఏ భవన నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించారు. ఇక త్వరలోనే ప్రజా ప్రతినిధుల కోసం నిర్మించిన భవనాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో ఏఐఎస్ సహా గ్రూప్ అధికారుల భవనాల నిర్మాణం, ఐకానిక్ భవనాల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. వీటితో పాటు వివిధ ప్రైవేటు సంస్థలకు ఇప్పటికే పెద్ద ఎత్తున భూమి కేటాయించారు. వీటిలో జరుగుతున్న నిర్మాణాలపై కూడా అధికారులు నిరంతరం పర్యవేక్షస్తున్నారు. ఇక అమరావతిలోని స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అకాడమీలు నిర్మిస్తోంది ఏపీ సర్కార్.
Also Read : లోకేష్ బాటలో జగన్.. వర్కవుట్ అవుతుందా..?
అమరావతిలోని నవ నగరాల్లో స్పోర్ట్ సిటీ ఒకటి. ఇందులో అన్ని క్రీడలకు సంబంధించిన అకాడమీలు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. రాజధాని అమరావతిలోని పిచ్చుకలపాలెంలో 12 ఎకరాలలో నిర్మించనున్న ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్మాణానికి ఎమ్ఎస్‌కే ప్రసాద్ భూమి పూజ నిర్వహించారు. రాజధానిలో నిర్మించనున్న ఈ అకాడమీలో విస్తృత శిక్షణ అందించి మెరికలలాంటి క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ అకాడమీ రాజధాని అమరావతిలో ఏర్పాటు కానుంది.
12 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఎంఎస్‌కే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ సముదాయంగా అభివృద్ధి చేస్తామని ఎమ్ఎస్‌కే ప్రసాద్ తెలిపారు. అకాడమీ ద్వారా స్థానిక క్రికెటర్లలో ప్రతిభను పెంపొందించడం, అమరావతిలో క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేస్తామన్నారు. అమరావతిలో నిర్మించనున్న సముదాయంలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన క్రికెట్ మైదానం, ప్రాక్టీస్ గ్రౌండ్లు, పూర్తి స్థాయిలో శిక్షణ సౌకర్యాలను కలిగి ఉంటుంది.
Also Read : నాగార్జునకు సురేఖ సారీ.. కారణం అదేనా..?
అమరావతిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో 400 మంది శిక్షణార్థుల సామర్థ్యంతో ఆధునిక నెట్‌లు, క్రీడాకారుల సామర్ధ్య విశ్లేషణా వ్యవస్థలతో కూడిన ఇండోర్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. అలాగే వెయ్యి మంది విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా క్రీడలలో శిక్షణతో పాటు అంతర్జాతీయ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయనున్నారు. క్రీడాకారులు, సందర్శక జట్ల కోసం ప్రత్యేక వసతి, హాస్టల్ సౌకర్యాలు నిర్మించనున్నారు. అలాగే స్థానికంగా టోర్నమెంట్ల నిర్వహణ కోసం మినీ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నారు. అత్యాధునిక జిమ్‌లు, ఫిజియోథెరపీ, పునరావాస కేంద్రం కూడా ఈ అకాడమీలో అందుబాటులో రానుంది. ఆధునిక ఫిట్‌నెస్, కండిషనింగ్ సదుపాయాలతో ఇండోర్, అవుట్‌డోర్ ట్రైనింగ్ జోన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒలింపిక్ ప్రమాణాలతో ఈత కొలను, క్రీడాకారుల ఆరోగ్య సంరక్షణకై ప్రత్యేక సదుపాయాలు సిద్ధం చేస్తున్నారు.
ఈ అకాడమీ సముదాయం నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలనే తన సంకల్పాన్ని మరొకసారి ప్రతిబింబిస్తోంది. అమరావతిని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అకాడమీ నిర్మాణానికి సీఆర్‌డీఏ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోంది.

