ఏపీలో ప్రతిపక్షమే లేదు. కానీ.. తెలుగుదేశం పార్టీలో మాత్రం ప్రతిపక్షం ఉంది. వర్గ పోరు, ఆధిపత్య పోరుతో టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. అయితే తిరువూరు నియోజకవర్గంలో మాత్రం ఇది తారాస్థాయికి చేరుకుంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గెలిచిన తొలి రోజు నుంచి ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తన నియోజకవర్గంలో ఎంపీ పెత్తనం అంటూ కొలికపూడి బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నారు కూడా.
Also Read : వారిని దూరం పెట్టారా..? లేక ఉంటున్నారా..?
తాజాగా తిరువూరు నియోజకవర్గం పరిధిలోని నెమలి గ్రామం వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆ ఉత్సవాలకు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హాజరయ్యారు. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించాలని ఆలయ ప్రధాన అర్చకులు, ఈవో ఎంపీ చిన్నీకి సూచించారు. సతీసమేతంగా వచ్చిన కేశినేని చిన్నీకి స్వామి వారి పట్టువస్త్రాలు అందించారు. అలాగే పక్కనే ఉన్న ఎమ్మెల్యే కొలికపూడికి స్వామి వారి తలంబ్రాలు అందించారు. అయితే దీనిని కొలికపూడి అవమానంగా భావించారు. చిన్నీ చేతుల్లో ఉన్న పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కున్నారు. స్వామికి తానే వస్త్రాలు సమర్పించేందుకు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Also Read : ఆఫ్ ది రికార్డ్.. అందుకే విందు రాజకీయం..!
కొలికపూడి చర్యలకు చిన్నీ ఎలాంటి జవాబు చెప్పకపోయినా.. ఆయన అనుచరులు మాత్రం అవమానంగా భావించారు. కొలికపూడి చేతుల్లో నుంచి పట్టువస్త్రాలు లాక్కునేందుకు యత్నించారు. దీంతో చిన్నీ, కొలికపూడి వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అధికారులు కూడా ఎవరి వైపు మాట్లాడాలేక చూస్తూ నిల్చున్నారు. చివరికి చిన్నీ సైలెంట్‌గా భక్తుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలో కింద కూర్చున్నారు. కొలికపూడి మాత్రం స్వామి వారికి వస్త్రాలు సమర్పించి.. వీఐపీ గ్యాలరీలో కూర్చున్నారు. కొలికపూడి, చిన్నీ మధ్య తోపులాట వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే క్రమశిక్షణ సంఘం ముందు హాజరై వివరణ ఇచ్చినప్పటికీ.. కొలికపూడి మాత్రం తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. ఇలాగే వదిలేస్తే.. కొలికపూడి వల్ల పార్టీకి చెడ్డపేరు ఖాయమంటున్నారు.

