దేశ భద్రతా చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కశ్మీర్ లోయలో భారత్లో జన్మించిన స్థానిక ఉగ్రవాదులు.. పూర్తిగా లేకుండా పోయారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. న్యూఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ నిర్వహించిన వార్షిక ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో ఆయన ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ హతమవ్వడంతో ఈ పరిస్థితి సాధ్యమైందని ఆయన తెలిపారు.
Also Read : విప్ ధిక్కరించి మరీ.. ఎంపీపీ ఎన్నిక వెనుక కుట్ర..!
నవంబర్ 11న సీఆర్పీఎఫ్ పోస్టుపై జరిగిన దాడిలో నిందితుడిగా ఉన్న రూ.15 లక్షల రివార్డు ఉన్న.. లతీఫ్ భట్ అంతంతో లోయలో స్థానిక ఉగ్రవాద ఉనికి తుడిచిపెట్టుకుపోయిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఉగ్రవాదంపై జీరో-టాలరెన్స్ విధానం క్షేత్రస్థాయిలో నిర్ణయాత్మక ఫలితాలను ఇస్తోందని అమిత్ షా కొనియాడారు. ఉగ్రవాద నెట్వర్క్ మొత్తాన్ని సమన్వయంతో నాశనం చేయాలని, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల ముప్పును అంతం చేయడానికి విదేశాల్లో తలదాచుకున్న సూత్రధారులను భారత న్యాయస్థానాల ముందు నిలబెట్టాలని ఆయన స్పష్టం చేశారు.
Also Read : భారతీయ రైల్వే.. బాబోయ్.. ఇదేం దోపిడి..?
ఇందులో భాగంగా 2019 నుంచి సీబీఐ, కేంద్ర హోంశాఖ, నిఘా సంస్థల సమన్వయ కృషితో 36 దేశాల నుంచి 303 మంది పరారీలో ఉన్న నేరస్థులను భారత్కు తిరిగి తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఒకే రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నామని అమిత్ షా వివరించారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఒకే రాత్రి 11 రాష్ట్రాల పోలీసులు, కేంద్ర సంస్థలు సంయుక్తంగా జరిపిన దాడులు ప్రపంచానికే ఒక కేస్ స్టడీగా నిలిచాయని అన్నారు. అలాగే పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టి నెట్వర్క్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించి, దేశవ్యాప్తంగా 40కి పైగా మాడ్యూళ్లను ధ్వంసం చేసి 271 మందికి పైగా అరెస్టు చేసినట్లు తెలిపారు.


