ఉత్తరాంధ్రలో బలం పెంచుకోవడానికి జనసేన వ్యూహకర్తల ప్రణాళిక ఫలించింది. 2029 శాసనసభ ఎన్నికల్లో, అదనపు సీట్ల కోసం ఉత్తరాంధ్రను ఎంచుకుంది. విజయవాడ దాటిన తర్వాత కమ్మ, రెడ్లను అధిగమించే శక్తి జనసేనకు లేదు. అవునన్నా, కాదన్నా పూర్వ గోదావరి జిల్లాలు, కాపు ఓట్ బ్యాంకు బలంగా కనిపిస్తున్నాయి. అదనంగా కావాలంటే, తూర్పు కాపులు, ఆదివాసుల సంఖ్య అధికంగా ఉండే ఉత్తరాంధ్ర మాత్రమే మిగిలింది. కాపు సెంటిమెంట్, గిరిజనులకు సినీ గ్లామర్ ప్రధానంగా ఉపయోగపడతాయని నాయకత్వం భావించింది. ఆ ప్రణాళికను అమలు చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికలు మంచిగా అవకాశంగా లభించాయి.
Also Read : నాడు వైఎస్సార్ ఆహ్వానిస్తే షర్మిల పెళ్లికి కూడా వెళ్లా: సీఎం చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర కంచుకోటగా ఉంది. రాయలసీమ, కమ్మ ప్రాబల్యం గల కోస్తా ప్రాంతం విడిచిపెట్టకుండా, తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రను వదులుకోవడానికి సిద్ధపడటం సాహసమే.! ఇంతకు మించి త్యాగం చేయడానికి ఆ పార్టీ దగ్గర మరేమీ లేదు. అల్లూరి, మన్యం జిల్లాలపై ముందుగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు, అటవీ, పర్యావరణ, గ్రామీణ అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాలు, గ్రామీణ నీటి సరఫరా వంటి కీలక శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. అందువల్ల, పదే పదే అల్లూరి ఏజెన్సీలో పర్యటించారు. డోలీల బాధల పట్ల, చెప్పులు లేని మహిళల పట్ల చాలా జాలిని ప్రదర్శించారు. గిరిజనులతో మమేకమవుతూ, ఒకటి రెండు గ్రామాల వారికి, సేంద్రీయ పద్ధతులతో పెంచిన తన తోట నుంచి మామిడి పండ్లు కూడా పంపించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం అల్లూరి, మన్యం జిల్లాలలో పునాదిరాళ్లు వేశారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమని ప్రకటించారు. ముఖ్యమంత్రితో కలిసి “అడవి బాట” పట్టారు. పార్టీ పరంగా, అరకు ఎంపీ స్థానానికి తన సోదరుడు నాగబాబును ఇన్ ఛార్జ్ గా నియమించారు. అల్లూరి జిల్లాలో ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో వాటిని అడిగితే, ఇవ్వడానికి టీడీపీకి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. మన్యం జిల్లాలో ఒక ఎమ్మెల్యే తమ పార్టీకి ఉన్నారు. సాలూరు, కురుపాం గిరిజన స్థానాల కోసం ముందస్తు ప్రణాళిక ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో సాలూరు తీసుకున్నారు. ఎమ్మెల్యే ఉన్న పాలకొండ కూడా సాధించారు.
Also Read : చంద్రబాబు, లోకేష్‌తో భేటీ అయినా తగ్గని ఆదినారాయణ రెడ్డి..!
సాలూరులో ఫలితం రాకపోయినా, భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. కురుపాం నియోజకవర్గం లో టీడీపీ ఎమ్మెల్యే వైఫల్యం, స్థానిక ఎన్నికల్లో కనిపించింది. మన్యం జిల్లాలో మరింత బలోపేతం కావడానికి, వాతావరణం అనుకూలంగా ఉంది. అల్లూరి జిల్లా పరిషత్ అడిగితే, ముందుగానే టీడీపీ అంగీకరించింది. కానీ, అక్కడ ఒక్క జడ్పిటిసి స్థానం కూడా గెలవలేదు. వైసీపీ ఆధిపత్యం కనిపించింది. దీనికి బదులుగా, మన్యం జిల్లా పరిషత్ జనసేన అడిగింది.
శ్రీకాకుళం మేయర్ స్థానం జనసేనకు కేటాయించిన తర్వాత, జిల్లా పరిషత్ టీడీపీకి ఉంటుందని ఆ పార్టీ నాయకులతో పాటు చాలామంది ఊహించారు. కానీ, జనసేనకు కేటాయించారు. చైర్ పర్సన్ పదవిని కాళింగులకు కేటాయించారు. మాజీ చైర్మన్ చౌదరి బాబి ప్రయత్నాలకు మంత్రి అచ్చెన్నాయుడు బ్రేకులు వేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బాజ్జీ సతీమణి నామినేషన్ వేసినప్పటికీ.. పోటీ నుంచి పక్కకు తప్పించారు. ఈ ఉపసంహరణ వెనుక జనసేనకే జడ్పీపీఠం కేటాయిస్తారని స్పష్టం అయ్యింది. ఓ వైపు విజయనగరం జెడ్పీ సీటు విషయంలో చిన్న శ్రీనుకు ఇచ్చిన మాటను లోకేష్ నిలబట్టుకున్నారు. దీంతో శ్రీకాకుళం జెడ్పీని జనసేనకు కేటాయించారు.
Also Read : మల్టీప్లెక్సుల నిలువుదోపిడీ.. ఓటీటీకే జై అంటున్న మిడిల్ క్లాస్..!
అదే సమయంలో, అనకాపల్లిని కూడా జనసేన అడిగి తీసేసుకుంది. కీలకమైన విశాఖను విడిచి పెట్టుకోవడానికి టీడీపీ నాయకత్వం ఇష్టపడలేదు. మొత్తానికి ఉత్తరాంధ్రలో ఎన్నికల ద్వారా వైసీపీకి ఒక జడ్పీ దక్కగా, కూటమిలో రెండు మాత్రమే ఉంచుకొని టీడీపీ నాయకత్వం మూడింటిని జనసేనకు కేటాయించడం గొప్ప విషయమే! టీడీపీలోని సీనియర్ నాయకులకు, కేడర్‌కు ఇది మింగుడుపడని విషయం.కొన్ని భాగాలు అటు ఇటుగా ఉన్న, పూర్వ విజయనగరం జిల్లాలో మేయర్, జడ్పీ పీఠం టీడీపీకి ఉన్నాయి. పూర్వ విశాఖ జిల్లాలో మేయర్, జెడ్పీ పీఠం ఉన్నాయి. కొత్త జడ్పీ పీఠాలు అనకాపల్లి, మన్యం కాగా, ఆ రెండు జనసేనకు దక్కడం ఒక కొత్త పరిణామం. మేయర్, జెడ్పీ చైర్ పర్సన్ టీడీపీకి లేని జిల్లా, శ్రీకాకుళం మాత్రమే కావడం. స్థానిక సంస్థల పదవుల కేటాయింపులు, ఖచ్చితంగా 2029 శాసనసభ, లోక్ సభ ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేస్తాయి.


