అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇరాన్ గనక తమతో ఒప్పందానికి రాకపోతే, మరో రౌండ్ సైనిక దాడులు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్యంత ఘాటుగా హెచ్చరించారు. ఫ్లోరిడాలో జరిగిన రిపబ్లికన్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, “మేము ఇరాన్‌పై మరోసారి లిటిల్ ఎపిక్ ఫ్యూరీ దాడికి దిగవచ్చు, లేదా వారు ఒప్పందానికి అయినా అంగీకరించాలి. వారు తెలివైన వారైతే నేరుగా చర్చల టేబుల్ ముందుకు వస్తారు” అని వ్యాఖ్యానించారు.
Also Read : వైసీపీకి ఎన్నికలంటే యుద్ధమేనా..?
గతంలో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడిలోనే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. ఆ దాడిని గుర్తు చేస్తూ ట్రంప్ మాట్లాడారు. అంతేకాకుండా, ఆపరేషన్ మిడ్నైట్ హామర్ ద్వారా ఇరాన్ యొక్క అణు సుసంపన్నత సామర్థ్యాన్ని తాము పూర్తిగా తుడిచిపెట్టామని, వారి ఆర్థిక, సైనిక వ్యవస్థను దెబ్బతీశామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను సాధించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Also Read : కర్నాటక కి లోకేష్ మాస్టర్ స్ట్రోక్
ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. అమెరికా “నిప్పుతో చెలగాటం ఆడవద్దు” అంటూ ఇరాన్ అధికారులు కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి మళ్లీ దాడికి దిగితే, గల్ఫ్ రీజియన్‌లోని సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుని ఇంటర్నెట్, సమాచార వ్యవస్థలను పూర్తిగా స్తంభింపజేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా గనక దాడి చేస్తే తమకు ఇక ఎలాంటి రెడ్ లైన్స్ ఉండవని, సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు ఉంటాయని ఇరాన్ అధికారి ఒకరు హెచ్చరించారు.


