ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరం క్లైమాక్స్‌కు చేరుతున్న వేళ అధికార కూటమిలో రెబల్ అభ్యర్థుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా తమకు టికెట్ దక్కలేదనే అసంతృప్తితో కూటమి ధర్మానికి విరుద్ధంగా స్వతంత్రులుగా బరిలోకి దిగిన నేతలపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసి, ఉపసంహరించుకోని ఏడుగురు మున్సిపల్ డివిజన్ రెబల్ అభ్యర్థులను పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Also Read : ఇషాన్ ఔట్.. వైభవ్ ఇన్? రెండో టీ20లో ఛాన్స్ దక్కేనా?
కేవలం విజయవాడనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లోని రెబల్ అభ్యర్థులపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా గురిపెట్టారు. ఇందుకోసం పార్టీ పరంగా ప్రత్యేక నిఘా విభాగాలను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో ఎవరెవరు కూటమి అభ్యర్థుల విజయవకాశాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఆయా జిల్లాల ఇంచార్జ్‌లకు, స్థానిక ఎమ్మెల్యేలకు పంపిస్తూ.. రెబల్స్‌ను దారికి తెచ్చే బాధ్యతలను వారికి అప్పగించారు.
Also Read : కర్నాటక కి లోకేష్ మాస్టర్ స్ట్రోక్
“కూటమి క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే సస్పెన్షన్ వేటు తప్పదు” అని చంద్రబాబు నాయుడు ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టికెట్ రాని నేతలకు భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల ద్వారా తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇస్తున్నప్పటికీ, కొందరు మొండికేస్తుండటంతో క్రమశిక్షణా చర్యల కొరడా ఝుళిపించడంకన్నా వేరే మార్గం లేదని పార్టీ భావిస్తోంది. విజయవాడ సెంట్రల్ సస్పెన్షన్ వేటు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా రెబల్స్ అందరికీ పార్టీ ఒక హెచ్చరిక పంపినట్లయింది.


