విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ భవిష్యత్తుకు పెద్ద పరీక్షగా మారాయి. జిల్లాలో సుదీర్ఘ కాలంగా తిరుగులేని ఆధిపత్యం చలాయించిన బొత్సకు… మజ్జి శ్రీనివాసరావు వంటి నమ్మకమైన అండదండలు ఉన్న నేతలు పార్టీని వీడటంతో గ్రౌండ్ లెవెల్లో పునాదులు కదిలిపోయాయి. దాంతో, జిల్లాపై తన పట్టు పూర్తిగా చేజారిపోతుందనే అభద్రతాభావం, భయం బొత్సను తీవ్రంగా వేధిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read : ఇషాన్ ఔట్.. వైభవ్ ఇన్? రెండో టీ20లో ఛాన్స్ దక్కేనా?
క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థుల వ్యూహాలను తట్టుకుని నిలబడే ఇతర గెలుపు గుర్రాలు ఎవరూ కనిపించకపోవడంతో, బొత్స తీవ్ర గందరగోళంలో పడిపోయారు. చిన్న శ్రీను ఎఫెక్ట్‌తో జిల్లా వైసీపీ మొత్తం ఖాళీ అయిపోవడంతో, మిగిలిన స్థానిక నాయకులలో ఎవరిని నమ్మాలో, ఎవరికి బాధ్యతలు అప్పగించాలో తెలియని నిస్సహాయ స్థితి బొత్సకు ఏర్పడింది. ఎన్నికల ఖర్చులకు వెనకడుగు వేయకుండా, పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండే నమ్మకమైన క్యాడర్ లేకపోవడంతో… వేరే ఏ దిక్కు లేక బొత్స మళ్లీ తన సొంత కుటుంబ సభ్యులనే రంగంలోకి దించాల్సి వచ్చింది.
జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా తమ హస్తగతం చేసుకోవాలనే తాపత్రయంతో… మొత్తం 27 జడ్పీటీసీ స్థానాల్లో తన కుమార్తె అనూష, కోడలు పూజిత, సోదరి వెంకటలక్ష్మి, తమ్ముడి కుమారుడు చైతన్యలతో 4 కీలక స్థానాల్లో నామినేషన్లు వేయించారు. ఈ ఫ్యామిలీ ప్యాక్ రాజకీయం బొత్స బలహీనతకు, ఒంటరితనానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు బొత్స కుటుంబానికి జీవన్మరణ సమస్యగా మారాయి.
Also Read : వైసీపీకి ఎన్నికలంటే యుద్ధమేనా..?
ఒకవేళ ఈ జిల్లా పరిషత్ పోరులో బొత్స ఫ్యామిలీ గనుక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటే… వైసీపీ అధిష్టానం బొత్స కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో కొత్త రక్తాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్న అధిష్టానం… బొత్స తన సొంత కుటుంబానికే టికెట్లు ఇచ్చుకుని కూడా జిల్లాను గెలిపించుకోలేకపోతే, ఉత్తరాంధ్ర రాజకీయాల నుండి వారిని శాశ్వతంగా పక్కన పెడుతుందనే ప్రచారం సాగుతోంది. అటు సొంత జిల్లాలో పట్టు కోల్పోయే ప్రమాదం, ఇటు ఓడిపోతే అధిష్టానం చేతిలో పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అయ్యే భయం… ఈ రెండింటి నడుమ బొత్స ఫ్యామిలీ విజయనగరం పరిషత్ పోరులో అత్యంత ప్రమాదకరమైన జూదం ఆడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


