సీఎంఓలో పనిచేసే ఐఏఎస్ అధికారులకు ఓర్పు, నేర్పు, లౌక్యం తప్పని సరిగా ఉండాల్సిందే. అధికారికి ఆ మూడు లేకుంటే సీఎంఓలో ఎక్కువ కాలం పనిచేయటం చాలా చాలా చాలా కష్టం. ముఖ్యంగా ఆవేశం అనేది మాటల్లో వినిపించకూడదు. చేష్టల్లో అసలు కనిపించకూడదు కూడా. గతంలో సీఎంఓలో వివిధ హోదాల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులు రిటైర్డు అయ్యారు. వారంతా ఎంత నిక్కచ్చిగా ఉన్నప్పటికీ.. పైకి మాత్రం శాంతంగానే కనిపించారు. జగన్ హాయంలో సీఎంఓలో పని చేసిన జవహర్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు విమర్శలు చేశారు తప్ప.. బ్యూరోక్రాట్లు మాత్రం పల్లెత్తు మాట అనలేదు. కానీ ప్రస్తుతం సీఎంఓలో కీలకంగా వ్యవహరిస్తున్న కార్తికేయ మిశ్రా తీరుపై మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : నానీ యాక్టివ్ అవ్వడానికి రీజన్ అదేనా..?
బాహుబలి సినిమాలో కాలకేయుల రాజు ఎంత భయంకరంగా ఉంటాడో.. కార్తికేయ మిశ్రా కూడా అలాగే ఉన్నారనేది ఐఏఎస్, సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ప్రభుత్వంలో ఓ కీలక నేత సిఫార్సుతో కార్తికేయ మిశ్రా సీఎంఓలో నియమితులయ్యారు. మొదట్లో నెమ్మదిగానే కనిపించిన కార్తికేయ మిశ్రా.. క్రమంగా కాలకేయ మిశ్రాగా మారిపోయారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ విమర్శలకు ఎన్నో సంఘటలను ఉదహరిస్తున్నారు కూడా. తొలి రోజుల్లో సీఎంఓ మిశ్రాలో మార్పు వస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన సీఎం చంద్రబాబు చెప్పినా కూడా మారడు అనే మాట బాగా వినిపిస్తోంది. మిశ్రాను సీఎంఓ నుంచి తప్పిస్తే తప్ప.. ఆయన తీరులో మార్పు రాదని సీఎంఓ అధికారులే చెబుతున్నారు.
నా వెనుక ఎవరున్నారో తెలుసా..? అనేది కార్తికేయ మిశ్రా పదే పదే చెబుతున్న మాట. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని తన తోటి అధికారులు, సన్నిహితులతో మిశ్రా ధీమాగా చెబుతున్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో పాటు అధికారులు కూడా మిశ్రా బాధితుల జాబితాలో ఉన్నారు. నిజానికి మిశ్రా తీరుపై ఇప్పటికే పలువురు మంత్రులు, నేతలు చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే చాలాసార్లు చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయినా కూడా కార్తికేయ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. టీడీపీ ప్రజాప్రతినిధులతో, పలు శాఖల అధికారులతో కూడా కార్తికేయ మిశ్రా అనవసర గొడవలు పెట్టుకుంటున్నట్లు తెలుసుకున్న చంద్రబాబు.. గతంలో గట్టిగానే వార్నింగ్ ఇచ్చినప్పటికీ.. ఆయన మాత్రం డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
నిజానికి సీఎం పేషీ అంటే 1996 – 2004 మధ్య కాలాన్నే ఎంతో మంది సీనియర్ ఐఏఎస్‌లు, రిటైర్డ్ ఐఏఎస్‌లు ఇప్పటికీ చెప్పుకుంటారు. అప్పుడు సీఎం పేషీలో అధికారం, అనుభవంతో పాటు సమర్థత, సీఎం పట్ల నమ్మకం, విధేయతతో పాటు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం కూడా ఉన్న వారే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం.. టీడీపీ పట్ల అభిమానం ఒక్కరిలోనే ఉందని.. మిగిలిన వారిలో వైసీపీ, జగన్ మోహన్ రెడ్డి అంటేనే అభిమానంతో ఉన్నారనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. గతంలో సీఎంఓలో పని చేసిన వారు.. చంద్రబాబు పట్ల విధేయతతో ఉన్నారు. అలాగే చంద్రబాబుపై వ్యంగ్య కామెంట్లు చేసేందుకు కూడా భయపడే పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం మచ్చుకైనా ఆ పరిస్థితులు కనిపించటం లేదు అనేది బాగా వినిపిస్తోంది.
Also Read : నాడు వద్దన్న అదానీ సోలార్.. నేడు ముద్దయింది
రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ విజయవాడ పర్యటన ముగిసిన తర్వాత గన్నవరం విమానాశ్రయంలో కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీపై అందరూ చూస్తుండగానే కస్సుబుస్సు అంటూ చిందులేశారు మిశ్రా. “నవ్వుతున్నావేంటి.. సరిగ్గా నిల్చో.. తమాషాలు చేయకు..” అంటూ సాటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అందరూ చూస్తుండగానే మిశ్రా నోరు పారేసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎలాంటి బూట్లు వేసుకోవాలో కూడా సలహా ఇచ్చిన మిశ్రా.. ఒక జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారికి కొరియర్ ద్వారా బూట్లు పంపి అవమానించారు. సీఎంఓలో చేరిన రోజు నుంచి మిశ్రా తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో గొడవ పడ్డారు. అప్పట్లో ఈ విషయం పెద్ద దుమారం రేపింది. చివరికి లోకేష్ స్వయంగా రంగంలోకి దిగి శబరికి నచ్చజెప్పారని పార్టీలో బాగా వినిపించిన మాట. ఇప్పటికైనా మిశ్రాను సీఎంఓ నుంచి తప్పించకపోతే.. కూటమి ప్రభుత్వానికి మరింత చెడ్డపేరు ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది.

