“కష్టకాలంలో వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్నారు. పార్టీ జిల్లా పగ్గాలు స్వీకరించాం.. పార్టీకి పూర్వ వైభోగం తెచ్చేందుకు కష్టపడుతున్నాం.. వైఎస్ కుటుంబానికి అయిన వారు కూడా పార్టీని వదిలి వెళ్లినా జగనన్న కోసం పార్టీని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తున్నాం. కాబట్టి మా కుటుంబానికి రెండు సీట్లు కేటాయించాలి.” అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బూచేపల్లి కుటుంబం కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కూటమి హవాలో కూడా దర్శి నియోజకవర్గంలో వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు శివప్రసాద్ రెడ్డి.
ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచే బూచేపల్లి వెంకాయమ్మ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ ఏడాది సెప్టంబర్‌తో వెంకాయమ్మ పదవీ కాలం పూర్తి అవుతుంది. ఈ పరిస్థితుల్లో దర్శితో పాటు కనిగిరి వైసీపీ టిక్కెట్ కూడా తమ కుటుంబానికే కావాలని వైసీపీ అధినేత జగన్ వద్ద ప్రతిపాదన చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి, పామూరు, హనుమంతునిపాడు, పీసీపల్లి, వెలిగండ్ల, సిఎస్ పురం మండలాలు ఉన్నాయి. అయితే నియోజకవవర్గాల పునర్ విభజన తర్వాత కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్ల, హనుమంతునిపాడు, మార్యాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల, పొదిలి మండలాలతో కొత్తగా పొదిలి నియోజకవర్గం ఏర్పడుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
Also Read : లోకేష్ సింధనూరు యాత్రకు ఊహించని రెస్పాన్స్..!
వైసీపీకి బలమైన హనుమంతునిపాడు, వెలిగండ్ల మండలాలు పొదిలికి వెళితే కనిగిరిలో టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు పోటీ ఉంటుంది. అంతే గాక ప్రస్తుతం పార్టీ ఇన్‌ఛార్జి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి. బీసీవై పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనిగిరి నుంచి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు. దీంతో యాదవ సామాజికవర్గం ఓట్లు చీలే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పూర్తి ఆర్ధిక, అంగ బలం ఉన్న బూచేపల్లి కుటుంబం నుండి వైసీపీ తరపున పోటీ వేస్తే కనిగిరిలో గెలుపు అవకాశాలు ఉంటాయని బూచేపల్లి వర్గం లెక్కలేస్తోంది.
జెడ్పీ చైర్మన్‌గా ఉన్న బూచేపల్లి కుటుంబం వైసీపీ పాలనలో కూడా అప్పటి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌కు వ్యతిరేకంగా పని చేసిన సందర్భాలున్నాయి. బుర్రాకు తెలియకుండానే హనుమంతునిపాడు, వెలిగండ్ల ఎంపీటీసీలకు భారీగా నిధులు కేటాయించడంతో వారంతా బూచేపల్లికి అనుకూలంగా వ్యవహరించారు. అప్పటి నుంచి వైసీపీ ఇన్‌ఛార్జి కూడా బూచేపల్లికి అనుకూలంగా వ్వవహరిస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని వైసీపీని వీడి జనసేనలో చేరడంతో దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి వెంటే ఎంపీటీసీలు తిరుగుతున్నారు. అంతేగాక బూచేపల్లి వెంకాయమ్మ కనిగిరిలో ఏ చిన్న ప్రైవేటు కార్యక్రమాన్ని కూడా వదలటం లేదు.
Also Read : వాళ్ళను సస్పెండ్ చేస్తా.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో మహిళలకు ఏ నియోజకవర్గం కేటాయించినా అక్కడ నుంచి వెంకాయమ్మ, జనరల్‌కు కేటాయించిన స్థానంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కనిగిరి వైసీపీ టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. మాజీ ఎమ్మెల్యేలు బుర్రా, కదిరితో పాటు ఇన్‌ఛార్జి, ఎంపీటీసీలతో మొత్తం నాలుగు గ్రూపులుగా కనిగిరి వైసీపీ విడిపోయింది. దీంతో కనిగిరిలో తిరిగి వైసీపీ జెండా ఎగరాలంటే తమకే టికెట్ ఇవ్వాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఇదే చర్చ అటు కనిగిరిలో, ఇటు దర్శిలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.

