ఒక్క ఫోన్ కాల్.. ఎక్కడి నుంచి వచ్చావో మళ్లీ అక్కడికే ట్రాన్స్‌ఫర్ అవుతావు.. అంటూ విక్రమార్కుడు సినిమాలో హీరో రవితేజతో విలన్ బావూజీ చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తే కదా. ప్రస్తుతం అలాంటిదే తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది. అయితే ఇక్కడ ప్రభుత్వాలకు, పార్టీలకు, ఉద్యోగులకు, రాజకీయ నేతలకు కూడా ఎలాంటి సంబంధం లేదు. ఓ చిన్న ఆన్ లైన్ వ్యాపారం చేసుకునే వాళ్లు నోరు జారడంతో.. చివరికి వ్యాపారానికే ఎసరు పెట్టుకున్నారు. హాయిగా సాగుతున్న మా జీవితం ఇలా అవుతుందంటూ ప్రతి సినిమా మొదట్లో గుట్కా గురించి వేసే యాడ్ అందరికీ గుర్తుంది. ఇప్పుడు అదే అలేఖ్య చిట్టి పికిల్స్ విషయంలో సరిగ్గా జరిగింది. మూడు పువ్వులు… ఆరు కాయలుగా సాగిపోతున్న వ్యాపారం కాస్త ఇప్పుడు మూత పడే పరిస్థితి. “నోరా.. వీపుకు చెప్పు దెబ్బా” అన్నట్లుగా నోరు జారినందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయిపోయింది. వ్యాపారం కూడా మూతపడిపోయింది.
Also Read : హిట్ 3 క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్ట్..?
రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు కూడా వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లు, పొడులు ఆన్ లైన్ ద్వారా ఆర్డర్లపై సరఫరా చేస్తుంటారు. అలేఖ్య, చిట్టి, రమ్య అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టారు. దీని ప్రమోషన్ కోసం సొంతంగా యాడ్ చేసుకున్నారు. అలాగే ఆగడు సినిమాలో మాదిరిగా వాళ్లే సొంతంగా ప్రమోషన్ చేసుకున్నారు. ఇన్‌స్టాలో రీల్స్ చేసుకుంటూనే బిజినెస్ ప్రమోషన్ చేసుకున్నారు. మార్కెట్‌లో విపరీతమైన పేరుతో పాటు డిమాండ్ కూడా బాగానే పెరిగింది. సోషల్ మీడియాలో వాళ్లే ఒక ఫోన్ నంబర్‌ను పెట్టి.. వాట్సప్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి పచ్చళ్లు పంపుతామంటూ ప్రకటించారు. ముందు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు… పచ్చళ్లు, పొడుల వివరాలు, ధరలతో సహా వచ్చేస్తాయి. అందులో నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకుంటే సరి. దీని కోసం బిజినెస్ వాట్సప్ వినియోగిస్తున్నారు. అయితే డిమాండ్ బాగా ఉండటంతో వీళ్ల పచ్చళ్లు బయట మార్కెట్ కంటే రేటు ఎక్కువ.
Also Read : సంచలనంగా మారిన ఏపీ సచివాలయ అగ్ని ప్రమాదం
ధరలను చూసిన కొందరు ఇంత రేటు ఎందుకు అని మెసేజ్ చేసిన పాపానికి.. వాళ్లకు తిట్ల దండకాలు. అవి రాయలేని బూతులు… ఈ మాత్రం డబ్బులు కూడా లేని నీకు ఎందుకు రా.. అంటూ అమ్మా, ఆలీ బూతులు తిడుతూ అలేఖ్య వాయిస్ మెసేజ్ చేసింది. ఇదే ఇప్పుడు వైరల్‌గా మారింది. బూతులతో రెచ్చిపోయిన వాయిస్ మెసేజ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలోనే అలేఖ్య చిట్టి పికిల్స్‌పై ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక మహిళ అయినప్పటికీ… మరో మహిళ గురించి ఇలా నీచంగా మాట్లాడటం ఎంత వరకు సబబు అని కామెంట్లు చేస్తున్నారు. వీళ్ల గురించి ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతుండటంతో చివరికి బిజినెస్ మొత్తం మూసేశారు. వాట్సప్ నంబర్, వెబ్ సైట్ క్లోజ్ చేశారు. చివరికి ఇన్‌స్టా అకౌంట్, యూ ట్యూబ్ ఛానల్ కూడా మూసేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చివరికి అలేఖ్య సోదరి రమ్య వెలుగులోకి వచ్చి వివరణ ఇచ్చారు. తమకు ప్రతి రోజు వేల మెసేజ్‌లు వస్తున్నాయని.. వాటిల్లో ఇంట్లో ఆడవాళ్లను బూతులు తిడుతున్నారని.. అందుకే ఇలాంటి ఆడియో మెసేజ్ పంపినట్లు రమ్య తెలిపారు. అయితే వేరే వారికి పంపాల్సిన వాయిస్ మెసేజ్ పొరపాటున మరొకరికి వచ్చిందని వివరించారు. వారికి మెసేజ్ చేశామని.. అయితే ఇది కావాలని చేసింది కాదని కూడా వివరణ ఇచ్చారు. అయితే ఇలా ఆడియో మెసేజ్ వైరల్ కావడంపై సామాజిక వేత్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.