వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం వ్యవహారం కూటమి పార్టీల మధ్య తీవ్ర చిచ్చు రేపుతోంది. జిల్లాలోని 39 జడ్పీటీసీ స్థానాలకు గానూ మెజారిటీ స్థానాలను కూటమి కైవసం చేసుకున్నప్పటికీ, జడ్పీ ఛైర్మన్ పదవి ఎవరికి దక్కాలన్న దానిపై టీడీపీ, బీజేపీ నేతల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి తన సోదరుడి కుమారుడు డాక్టర్ చదిపిరాళ్ల రాజేష్ రెడ్డికి జడ్పీ ఛైర్మన్ పదవిని ఇప్పించేందుకు మొదటి నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, కడప జడ్పీ ఛైర్మన్ పదవిని టీడీపీ సీనియర్ నేత పుత్తా నరసింహారెడ్డికి కేటాయించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలియడంతో ఆదినారాయణరెడ్డి తీవ్ర అలక వహించారు.
Also Read : తల్లయిన సమంత.. ముద్దుల కుమారుడి పేరు ఇదే..!
అధిష్టానం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఏకంగా తన ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసే యోచనలో ఉన్నారన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. జిల్లాలో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవాల కోసం తాను ఎంతో శ్రమించానని, అయినా బీజేపీకి ప్రాధాన్యత దక్కలేదని ఆయన తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డి బాటలోనే ఆయన నియోజకవర్గ పరిధిలోని జమ్మలమడుగు, ముద్దనూరు, ఎర్రగుంట్ల మండలాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Also Read : 35 ఏళ్ల తర్వాత కశ్మీర్లో సంచలనం.. అమిత్ షా కీలక ప్రకటన..!
ఈ నేపథ్యంలో తన భవిష్యత్ కార్యాచరణ మరియు రాజీనామా అంశంపై స్పష్టత ఇచ్చేందుకు ఆదినారాయణరెడ్డి త్వరలోనే విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కూటమి నేతల మధ్య తలెత్తిన ఈ అనూహ్య సంక్షోభాన్ని అధిష్టానం ఏ విధంగా చక్కదిద్దుతుంది, పుత్తా వర్సెస్ ఆదినారాయణరెడ్డి పోరు ఎక్కడికి దారితీస్తుందన్న దానిపై కడప జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.


