ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈవీఎంలపై నమ్మకం లేదని, బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని గతంలో గట్టిగా డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ ఓటర్లు బ్యాలెట్ బాక్సుల సాక్షిగా కోలుకోలేని షాక్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన ఫలితాల్లో 13 కార్పొరేషన్లలో ఏకంగా 12 చోట్ల కూటమి మేయర్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేయగా, వైసీపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది.
Also Read : బ్రేకింగ్: పరిషత్ ఎన్నికలు వాయిదా..? ఎస్‌ఈసీ కీలక సమీక్ష..!
వైసీపీకి అత్యంత గట్టి కోటగా భావించే కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థి చారిత్రాత్మక విజయం సాధించారు. వైఎస్ జగన్ సొంత చిన్నమ్మ, వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై టీడీపీ అభ్యర్థి గీతాకుమారి సుమారు 13 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి కంచుకోటను బద్దలు కొట్టారు. బ్యాలెట్ ఓటింగ్‌లోనే వైసీపీకి ఇంతటి పరాభవం ఎదురుకావడంతో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. గత సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ ద్వారా జరగాలని పట్టుబట్టింది. అయితే కౌంటింగ్ పూర్తయ్యాక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి క్లీన్ స్వీప్ చేయడంతో జగన్ మాట మార్చారు. ఇవి “ఎలక్షన్లు కావు.. కేవలం సెలక్షన్లు” అంటూ, ఎన్నికల ప్రక్రియ అంతా రిగ్గింగ్ అయిందంటూ మళ్లీ నెపం అధికారులపై, కూటమి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా కౌంటర్లు ఇస్తున్నారు.
Also Read : మోక్షజ్ఞ సరసన స్టార్ హీరోయిన్ కూతురు
విజయవాడ కార్పొరేషన్‌లో జనసేన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకోగా, విశాఖపట్నంలో టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి ఏకంగా 2.5 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. గుంటూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప ఇలా దాదాపు అన్ని మేజర్ కార్పొరేషన్లలో కూటమి హవా స్పష్టంగా కనిపించింది. ఈ ఫలితాల ద్వారా రాష్ట్ర ప్రజల తీర్పు పూర్తిగా కూటమి వైపే ఉందని, జగన్ ప్రజా తీర్పును అంగీకరించకుండా సాకులు వెతుకుతున్నారని కూటమి నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు.


