ప్రశాంతంగా హైదరాబాద్ నగరం సేద నిద్రపోతున్న వేళ.. ఓ అలజడి నగర వాసుల కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఏం జరిగిందో, ఏం అవుతుందో తెలియదు.. కానీ ఏదో మాత్రం జరిగింది అనే భయం ప్రజలను వెంటాడింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడును తలపించేలా శబ్దాలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉదయం 9:15 గంటల సమయంలో రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లి, ఎర్రబోడ, లంగర్‌హౌస్, అత్తాపూర్, కేశవస్వామినగర్ వంటి పలు ప్రాంతాల్లో ఈ విచిత్రమైన భారీ శబ్దాలు స్పష్టంగా వినిపించాయి.
Also Read : క్లీన్ ఎనర్జీ క్యాపిటల్‌గా ఏపీ.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ పోస్ట్..!
ఈ హఠాత్ పరిణామంతో ఏం జరుగుతుందో తెలియక స్థానిక నివాసితులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ భారీ శబ్దం వచ్చిన సమయంలో దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించినట్లు అనిపించిందని, ఇళ్లలోని వస్తువులు కదిలి కిందపడ్డాయని స్థానికులు వాపోయారు. కొన్ని ఇళ్ల కిటికీల అద్దాలు కూడా గలగలలాడటంతో, అసలు ఎక్కడైనా పెద్ద ప్రమాదం లేదా పేలుడు సంభవించిందా లేక భూకంపం ఏమైనా వచ్చిందా అనే అనుమానంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు, అపార్ట్మెంట్ల పైకి పరుగులు తీశారు.
Also Read : విశాఖ మేయర్.. రంగంలోకి చంద్రబాబు..!
దీంతో ఆయా కాలనీల్లో కాసేపు తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. భూమి కంపించిందంటూ సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేయడంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఈ భారీ శబ్దం వెనుక ఉన్న అసలు కారణాలపై ఆరా తీస్తున్నారు. ఎక్కడైనా క్వారీ బ్లాస్టింగ్స్ జరిగాయా, లేక వాతావరణ మార్పుల వల్ల వచ్చిన శబ్దాలా లేదా భూ అంతర్భాగంలో వచ్చిన స్వల్ప కదలికలా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ శబ్దానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.


