విజయవాడ నగర రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ముందే మేయర్ సీటుకు సంబంధించిన రచ్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రాబోయే కార్పొరేషన్ ఎన్నికలపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ మేయర్ పీఠాన్ని ఈ సారి ఖచ్చితంగా ముస్లిం మైనారిటీలకే కేటాయించాలంటూ ఆయన పార్టీ అధిష్ఠానానికి గట్టి డిమాండ్ వినిపించారు. బెజవాడలో ముస్లిం మైనారిటీల ఓటు బ్యాంక్ బలంగా ఉన్నందున, వారికి ఈ అవకాశం ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
Also Read : దానం నాగేందర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు
ముస్లిం సమాజానికి చెందిన నాయకుడికి మేయర్ అయ్యే అవకాశం కల్పిస్తే.. ఎన్నికల్లో పార్టీ తరఫున ఎలాంటి అసంతృప్తులు, పోటీలు ఉండవని, అందరూ కలిసికట్టుగా కూటమి విజయం కోసం పనిచేస్తారని జలీల్‌ఖాన్ స్పష్టం చేశారు. అయితే, ఒకవేళ సామాజిక సమీకరణాలు మరియు రిజర్వేషన్ల ప్రకారం విజయవాడ మేయర్ సీటు గనుక మహిళలకు రిజర్వ్ అయితే, తన కుమార్తెకు ఆ అవకాశం ఇవ్వాలని ఆయన చంద్రబాబు నాయుడిని కోరారు. తన కుమార్తెకు ఉన్న అర్హతలు, నగర ప్రజల్లో ఉన్న పట్టు ఆధారంగా ఆమె మేయర్ పీఠానికి పర్‌ఫెక్ట్ ఛాయిస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : భారత పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..!
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింల ప్రాధాన్యతను గుర్తిస్తూ పార్టీ అధిష్ఠానం ఈ ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలించాలని ఆయన కోరారు. గత సార్వత్రిక ఎన్నికల సమయం నుండి పశ్చిమ సీటు విషయంలో కొన్ని సమీకరణాలు మారిన నేపథ్యంలో.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ పీఠంపై జలీల్‌ఖాన్ ఓపెన్‌గా ఈ వ్యాఖ్యలు చేయడం బెజవాడ రాజకీయంలో హాట్ టాపిక్‌గా మారింది. మరి జలీల్‌ఖాన్ పెట్టిన ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

