సోషల్ మీడియాలో లగ్జరీ లైఫ్‌స్టైల్ వీడియోలతో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ప్రముఖ తెలుగు యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు రమా నందనను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లో ఉద్యోగాలు, వీసాల ఇప్పిస్తామంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నిరుద్యోగుల నుండి ఆమె మరియు ఆమె భర్త భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
Also Read : నటి త్రిష వివాదంపై విజయ్ సంచలన కామెంట్స్..!
ఈ క్రమంలో ఆమెపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ కావడంతో, విదేశాల నుండి వస్తున్న ఆమెను విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రమా నందన తన భర్త జాగర్లమూడి మధుకర్‌తో కలిసి లండన్‌లో నివసిస్తూ ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ అనే సంస్థను నడిపేవారు. బ్రిటన్‌లో ఉద్యోగ వీసాలు, స్పాన్సర్‌షిప్ సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ నమ్మబలికి, యూట్యూబ్ ఇమేజ్‌ను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు వీరిపై బాధితులు ఆరోపిస్తున్నారు.
Also Read : చంద్రబాబు సొంత జిల్లాకు పవన్ గిఫ్ట్..!
డబ్బులు తీసుకున్న తర్వాత వీసాలు ఇప్పించకపోగా, బాధితులను బెదిరింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ వీసా స్కామ్‌పై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు గతంలోనే చీటింగ్ కేసు నమోదైంది. కేసు నమోదైనప్పటి నుండి నిందితులు విదేశాల్లోనే పరారీలో ఉండటంతో పోలీసులు దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే శంషాబాద్‌లో పట్టుబడిన నందనను తదుపరి విచారణ మరియు చట్టపరమైన చర్యల నిమిత్తం ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించేందుకు హైదరాబాద్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. యూట్యూబ్‌లో అమాయకంగా కనిపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంత పెద్ద వీసా ఫ్రాడ్‌కు పాల్పడటం సోషల్ మీడియా సర్కిల్స్‌లో తీవ్ర సంచలనంగా మారింది.

