దేశంలో పండుగల సీజన్ ముందే చక్కెర ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఒక అత్యవసర నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో కొరత రాకుండా, ధరలను అదుపు చేయడానికి వీలుగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను ఎటువంటి సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, భారతదేశంలో ఉన్న డిమాండ్‌ను చూసి తాము చక్కెర సరఫరా చేస్తామంటూ పాకిస్తాన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో ఉన్న 12 లక్షల టన్నుల అదనపు చక్కెర నిల్వలను భారత్‌కు ఎగుమతి చేయడానికి అనుమతించాలని పాక్ వ్యాపారులు అక్కడి ప్రభుత్వాన్ని కోరారు.
Also Read : పైకి మాత్రమే సస్పెన్షన్.. వెనక మాత్రం..!
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో సగటు ధర కిలో 52 రూపాయలు దాటగా, పంజాబ్, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కిలో చక్కెర ధర రూ.63 నుండి రూ.65 కి చేరింది. నిజానికి దేశంలో చెరకు పంట బాగానే పండినప్పటికీ, ఇంత కొరత ఏర్పడటానికి పెట్రోల్‌లో కలిపే ‘ఇథనాల్ బ్లెండింగ్’ పాలసీయే కారణమని నిపుణులు చెబుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యంతో చక్కెర తయారు కావాల్సిన చెరకు రసాన్ని భారీగా ఇథనాల్ తయారీకి మళ్లించారు.
Also Read : వారణాసి నుంచి క్రేజీ అప్‌డేట్..!
దీనివల్ల దేశీయంగా చక్కెర ఉత్పత్తి తగ్గి, నిల్వలపై ఒత్తిడి పడి ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. పండుగల వేళ చక్కెర ధరలు పెరగడం దేశంలో కొత్త రాజకీయ వివాదానికి తెరలేపింది. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు చక్కెరను భారీగా ఎగుమతి చేసిన భారతదేశం, ఈరోజు దిగుమతి చేసుకునే పరిస్థితికి రావడం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీల ఇథనాల్ వ్యాపారాల కోసమే సామాన్యుడిపై చక్కెర భారం మోపారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనా, రాబోయే వినాయక చవితి, దసరా, దీపావళి పండుగల నాటికి ధరలను కంట్రోల్ చేయడమే లక్ష్యంగా కేంద్రం వేగంగా ఈ దిగుమతుల ప్రక్రియను చేపట్టింది.

