పాకిస్తాన్ కేంద్రంగా భారత్ పై ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న నిషేధిత సంస్థ లష్కరే తోయిబాకు గట్టి షాక్ తగిలింది. గత 3 నుంచి 4 ఏళ్లలో పాకిస్తాన్ లోని వివిధ నగరాల్లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా కీలక ఉగ్రవాదులను భారత ఇంటెలిజెన్స్ ఏజెంట్లు టార్గెట్ చేసి హతమార్చారంటూ ఆ సంస్థకు చెందిన అగ్రశ్రేణి ఉగ్రవాది ఒకరు బహిరంగంగానే అంగీకరించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఈ ఉగ్రవాది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Also Read : జగన్ పర్యటన దెబ్బ.. ధర్మాన చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
భారత్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ రిజ్వాన్ హనీఫ్ ఒక సభలో ప్రసంగిస్తూ ఈ సంచలన నిజాలను వెల్లడించాడు. పాకిస్తాన్ లో అజ్ఞాత వ్యక్తుల చేతిలో హతమవుతున్నది తమ వారేనని ఒప్పుకున్నాడు. సభలో రిజ్వాన్ హనీఫ్ మాట్లాడుతూ… “గత నాలుగు సంవత్సరాలలో పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాలలో మాకు చెందిన 30 మందికి పైగా సభ్యులను భారత ఇంటెలిజెన్స్ ఏజెంట్లు అత్యంత వ్యూహాత్మకంగా మట్టుబెట్టారు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావాలాకోట్ వంటి నగరాల్లో మా వాళ్లను వెతికి మరీ చంపేస్తున్నారు” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read : మళ్లీ మొదలైన కావేరీ రచ్చ.. విజయ్ సంచలన నిర్ణయం..!
ఈ వరుస హత్యలతో తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయిన రిజ్వాన్ హనీఫ్, ఈ ప్రసంగంలో హిందూ మతంపై మరియు ఇతర మతాలపై తీవ్రమైన ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రాణాలు పోతున్నా సరే భారత్ పై తమ ఉగ్రవాద పోరాటం ఆగదంటూ పాకిస్తాన్ ప్రజలను మరియు యువతను రెచ్చగొట్టేందుకు మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రసంగించాడు. ఈ వీడియో యొక్క విశ్వసనీయతను భారత భద్రతా సంస్థలు కూడా ధృవీకరించినట్లు సమాచారం. గత కొంతకాలంగా పాకిస్తాన్ లో దాక్కున్న భారత వ్యతిరేక ఉగ్రవాదులు, ముంబై దాడుల సూత్రధారులు వరుసగా వీధుల్లోనే గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని పాకిస్తాన్ రక్షణ నిపుణులు అన్నోన్ గన్మెన్ మోడల్ అని పిలవడం గమనార్హం.

