కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్కార్‍లో సీఎం కుర్చీ మార్పు దాదాపు ఖాయమైంది. ఎంతో కాలంగా సీఎం కుర్చీ కోసం తహతహలాడుతున్న ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కల నెల వేరే సమయం ఆసన్నమైనట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు డీకే శివకుమార్ ఎంతో కృషి చేశారు. ఆర్థికంగా డీకేను అడ్డుకునేందుకు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ.. ధీటుగా నిలబడి.. పార్టీని గెలిపించారు డీకే. ఆ తర్వాత సీఎం పదవి ఖాయమని అంతా భావించినప్పటికీ.. సామాజిక సమీకరణల్లో భాగంగా అనూహ్యంగా సిద్ధరామయ్య కుర్చీ ఎక్కారు.
Also Read : అఖిల్ కెరీర్ మార్చే సినిమా ఇదేనా?
2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 135 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 66 స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు సీఎం కుర్చీ ఇవ్వాలని అంతా డిమాండ్ చేసినప్పటికీ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుబ కులానికి చెందిన సిద్ధరామయ్యకు ఇవ్వాలని మఠాధిపతులు కాంగ్రెస్ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో కుర్చీ విభజన ఒప్పందం జరిగినట్లు అప్పట్లో పుకార్లు వచ్చాయి. తొలి మూడేళ్లు సిద్ధరామయ్యకు అవకాశం ఇచ్చి.. చివరి రెండేళ్లు శివకుమార్‌ను కుర్చీ పెడతారని అప్పట్లో కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలిసింది.
అయితే మధ్యలో కొద్ది రోజుల పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. దీంతో.. సీఎం మార్పు లేదని.. ఎన్నికల వరకు తానే సీఎంగా ఉంటానంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి కూడా. ఈ వ్యవహారంపై పార్టీ పెద్దలు సైతం జోక్యం చేసుకున్నారు. చివరికి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే స్వయంగా రంగంలోకి దిగారు. ఇద్దరి మధ్య రాజీ కుదర్చడంతో.. పరిస్థితి సద్దుమణిగింది. చివరికి సిద్ధరామయ్య మూడేళ్ల పదవీ కాలం ముగియడంతో.. ఇప్పుడు మళ్లీ సీఎం మార్పు అంశం తెరపైకి వచ్చింది.
Also Read : రాప్తాడులో హైటెన్షన్.. తోపుదుర్తి బ్రదర్స్ కు స్టార్ట్ అయిందా..?
తాజాగా సిద్ధరామయ్య, శివకుమార్ ఢిల్లీ పర్యటన కర్ణాటకలో సీఎం మార్పు ఖాయమని తేలిపోయింది. కేవలం రాజ్యసభ ఎన్నికలపై మాత్రమే చర్చించినట్లు ఇద్దరు నేతలు పైకి చెప్పినప్పటికీ.. సిద్ధు రాజీనామా దాదాపు ఖాయంగా తేలిపోయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య రాజీనామా చేస్తే.. ఆయన్ని దేశ రాజకీయాల్లోకి ప్రవేశింపజేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నెల 28వ తేదీన సిద్ధరామయ్య రాజీనామా ఖరారు అయినట్లు జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి.
కర్ణాటక పీసీసీకి నూతన అధ్యక్షుడి నియామకం తరువాత సీఎల్పీ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపిన తర్వాత.. ఆయన గౌరవం తగ్గకుండా రాజ్యసభ ప్రతిపక్ష నేతగా ఎన్నుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే సిద్ధరామయ్య కొడుకుకి మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం కోరుకునేలా మార్పు జరుగుతుందా లేక రాజస్థాన్ సీన్ రిపీట్ అవుతుందా అనేది చూడాల్సి ఉంది. గతంలో రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్‌ను తప్పిద్దామని భావించిన కాంగ్రెస్ అధిష్టానానికి గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం కర్ణాటకలో ఆ పరిస్థితి తలెత్తకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

