రాజకీయాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రావడం ఎంత గొప్ప విషయమో, ఆ పదవిని నిర్వహించడం కూడా అంతే కష్టం. దాదాపుగా అదొక రకమైన అగ్నిపరీక్ష. ఈ పదవిని చేపట్టిన నాయకులు చరిత్రలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు చూస్తే, అది సాఫీగా సాగే ప్రయాణం కాదని స్పష్టంగా.. అర్థమవుతుంది. ఇప్పుడు నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టారు. మరి గత నాయకుల అనుభవాల దృష్ట్యా లోకేష్ ముందున్న సవాళ్లు ఏంటి..?
గతంలో ఈ పదవి చేపట్టిన చాలా మంది నాయకులు రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ చరిత్రలో వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా పనిచేసిన కమలాపతి త్రిపాఠి, అర్జున్ సింగ్, జితేంద్ర ప్రసాద వంటి వారు ఆ తర్వాత రాజకీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. తెలంగాణా ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి.. 2018లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి తన సొంత నియోజకవర్గం కొడంగల్ లోనే ఓడిపోయారు. అది ఆయన కెరీర్‌లో ఒక పెద్ద మచ్చగా మిగిలిపోయింది. 2023 లో విజయం సాధించే వరకు ఆయన నానా కష్టాలు పడ్డారు.
Also Read : డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుకు షాక్..!
కేటిఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత, వరుసగా లోక్సభ ఎన్నికలు, ఆపై 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. ప్రస్తుతం ఆయన అనేక రాజకీయ ఇబ్బందులు, కేసులతో నానా ఇబ్బందులు పడుతున్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ విషయంలో కూడా ఇలాగే జరిగింది. పంజాబ్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి సొంత పార్టీ సీఎం చన్నీతోనే గొడవపడి, చివరికి పార్టీని ఓడించడమే కాకుండా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఎదురయ్యే అతిపెద్ద సమస్య హైకమాండ్ తో సమన్వయం.
పార్టీలో ప్రెసిడెంట్ ఒకరు, వర్కింగ్ ప్రెసిడెంట్ మరొకరు ఉండటం వల్ల నిర్ణయాల విషయంలో క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది. సీనియర్ నాయకులు ఎవరి మాట వినాలో తెలియక అయోమయానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఏ పార్టీలో అయినా సీనియర్ నేతలు ఉంటారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారు, తమ కన్నా జూనియర్ అయిన వ్యక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తమపై పెత్తనం చెలాయిస్తుంటే సహించడం కాస్త కష్టమే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఇదే. కేటిఆర్ ఎదుర్కొంటున్న సమస్య కూడా ఇదే.
Also Read : తిరుమలలో ఆ దర్శనం రద్దు..!
లోకేష్ విషయంలో కూడా టీడీపీలో ఉన్న సీనియర్ మోస్ట్ నేతలను సమన్వయం చేసుకోవడం ఆయనకు పెద్ద పరీక్ష. అయితే లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ సమస్య రాకపోవచ్చు. పార్టీ ఏదైనా ఎన్నికల్లో గెలిస్తే ఆ క్రెడిట్ అంతా అధినేతకు వెళ్తుంది. కానీ ఓడిపోతే మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ సరిగ్గా పని చేయలేదు అనే విమర్శ వస్తుంది. కేటీఆర్ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు లోకేష్ కూడా 2029 ఎన్నికల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కించాల్సిన గురుతర బాధ్యతను మోయాల్సి ఉంటుంది.
ఏ చిన్న పొరపాటు జరిగినా వేలెత్తి చూపడానికి ప్రత్యర్థులు సిద్ధంగా ఉంటారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పార్టీ ముఖచిత్రం. అందుకే అధికార పార్టీలు లేదా ప్రతిపక్షాలు నేరుగా వర్కింగ్ ప్రెసిడెంట్ నే టార్గెట్ చేస్తాయి. లోకేష్ తన ప్రతి నిర్ణయంపై నిరంతరం పర్యవేక్షణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నారా లోకేష్ కు ఇది కేవలం పదవి కాదు, తన సమర్థతను నిరూపించుకునే అవకాశం. రేవంత్ రెడ్డి, కేటీఆర్ లాంటి నేతలు ఎదుర్కొన్న పదవి గండం నుంచి బయటపడి, టీడీపీని వచ్చే ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చగలిగితేనే ఆయన సెంటిమెంట్ గండం నుంచి బయటపడ్డట్టు.

