స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్ర అనేది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నినాదం. ఇప్పటికే చెత్త సమస్య పరిష్కారం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. అలాగే చెత్త నుంచి సంపద పేరుతో ప్రత్యేక చెత్త శుద్ధి కేంద్రాలను కూడా నిర్వహిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ప్రాంతాల్లో అయితే పారిశుద్ధ సమస్య పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు కూడా. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక క్షేత్రాలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, నదీ తీరాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టింది ప్రభుత్వం. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల గిరులను పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో చర్యలు చేపట్టింది. “స్వచ్ఛ తిరుమల” నినాదంతో నిరంతరం ప్రచారం చేస్తోంది. తిరుమల కొండపై భక్తులు చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాల నుండి చెత్తను రోడ్లపై పడేయరాదని టీటీడీ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. “స్వచ్ఛ తిరుమల” వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఇప్పటికే పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరించడానికి ఈవో సహా ఇతర అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు చెత్తను చెత్తబుట్టలలో వేయాలని, రోడ్లపై చెత్త వేయడం మానుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నారు. వాటర్ బాటిళ్లను కూడా గాజు సీసాలవే వినియోగిస్తున్నారు. అయితే టీటీడీ అధికారులకు పెద్ద సమస్య తలనొప్పిగా మారింది. అదే చెత్త సేకరణతో పాటు దానిని రీ సైకిలింగ్ చేయడం. ప్రతి రోజు తిరుమలలో సేకరించిన చెత్తను అక్కడే కొండల మధ్య పడేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల తీవ్ర దుర్గంధంతో పాటు తిరుమల పవిత్రత కూడా దెబ్బ తింటుందనే మాట బాగా వినిపిస్తోంది. చెత్త సమస్య పరిష్కారానికి టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా తిరుమలలో చెత్త నిర్వహణపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. తిరుమల కొండపై ఉంటున్న వారి నిర్లక్ష్యం వల్లే వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. అక్కడ వ్యాపారం చేస్తున్న చెత్తను పడేయటం లేదని.. దానిని టీటీడీ సేకరించాల్సి వస్తుందన్నారు. అదే సమయంలో తిరుమలలో 7 కొండలు కాదు.. ఇంకో కొండ ఉందన్నారు. అతి చెత్త కొండ అన్నారు. దానిని స్వయంగా తాను పరిశీలించానట్లు తెలిపారు. దీనిపై బోర్డు సమావేశంలో కూడా చర్చించామన్నారు. 3, 4 నెలల్లో మొత్తం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఐదారేళ్ల నుంచి అక్కడ వేసే చెత్తను తొలగించలేదన్నారు. అందుకే ఆ చెత్త కొండ 150 అడుగులుందన్నారు. రెండు కొండల మధ్య చెత్త పోశారని.. దాని వల్ల వర్షపు నీరు అక్కడ నిలిచిపోయిందని.. దాని వల్ల దుర్వాసన, దోమలు బాగా వస్తున్నాయన్నారు. ఆ చెత్త మొత్తం నాలుగు నెలల్లో తొలగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

