కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహా కవి శ్రీ శ్రీ.. అదే మాటను రాజకీయ పార్టీల నేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కాకా హోటల్, టీ కొట్టు, బజ్జీల బండి.. ఇలా ఏదైనా సరే.. కాదేదీ ప్రచారానికి అనర్హం అంటున్నారు నేతలు. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. గెలుపు కోసం పడరాని పాట్లు పడుతుంటారు. అప్పటి వరకు కనీసం తలెత్తి కూడా చూడని నేతలు.. ఎన్నికలప్పుడు మాత్రం.. మీరే మా దేవుళ్లు అంటూ ఓటర్ మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు తెగ తాపత్రయ పడుతుంటారు.
Also Read : భారతి సిమెంట్ మేనేజర్ పై కేసు..!
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. ఉప ఎన్నిక అయినప్పటికీ.. ఈ ఎన్నికలో గెలుపు ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారింది. కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు ఇదే సరైన తీర్పు సమయం అని బీఆర్ఎస్ నేతలు అంటుంటే.. గ్రేటర్ ఎన్నికలకు జూబ్లీహిల్స్ నుంచే గెలుపు బాట వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఆఘమేఘాల మీద అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇచ్చారనే మాట వినిపిస్తోంది.
ఇక గెలుపు కోసం అన్ని దారులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాజాగా తమ్ముడు కోడుకు నారా రోహిత్ వివాహం కోసం హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు.. అక్కడ తన పాత కారును చూశారు. 1994-2004 మధ్య కాలంలో అంబాసిడర్ కారును ఉపయోగించారు. 393 నంబర్ గల ఈ అంబాసిడర్ వాహనం ఆయన అధికారిక వాహన శ్రేణిలో ముఖ్యమైనది. రాష్ట్రమంతటా ఈ కారులోనే పర్యటించారు కూడా. ఇదే అంబాసిడర్ కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే అలిపిరి బ్లాస్ట్ నుంచి చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారు.
ప్రస్తుతం ఆ కారు మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంది. పార్టీ ఆఫీసుకు వచ్చిన చంద్రబాబు.. ఆ కారు చూసి మురిసిపోయారు. ‘విత్ మై ఓల్డ్ ఫ్రెండ్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలను ఇప్పుడు పొలిటికల్‌గా వాడుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో టీడీపీ దూరంగా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతు ఇచ్చారని.. కారు గుర్తుకు ఓటు వేయమని పరోక్షంగా చెప్పారని గులాబీ పార్టీ నేతలు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాతో పాటు చంద్రబాబు కారుతో ఉన్న ఫోటోలను పోస్టర్లుగా వేసి ప్రచారం చేస్తున్నారు.
Also Read : పవన్ కు కేంద్రం షాక్ ఇచ్చిందా..?
చంద్రబాబు కారుకు సపోర్ట్ చేస్తున్నారంటున్న ఆ పార్టీ నేతలు.. ఓల్డ్ ఫ్రెండ్ అంటే కేసీఆర్ అని.. గతంలో చంద్రబాబు క్యాబినెట్‌లో కేసీఆర్ పని చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే మాగంటి సునీత ఆంధ్ర ఆడపడుచు అని.. 2014లో మాగంటి గోపీనాథ్ కూడా టీడీపీ తరఫునే గెలిచారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు పోస్ట్ చేసిన ఒక్క ఫోటో.. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పెద్ద దుమారం రేపుతోంది.

