సాధారణంగా ప్రభుత్వ అధికారుల పనితీరు విషయంలో మనం ఎన్నో విమర్శలు చూస్తూ ఉంటాం. ప్రజలను పట్టించుకునే అవకాశం ఉండదు అనే విమర్శలు ఎన్నో సందర్భాల్లో వస్తూ ఉంటాయి. కష్టాల్లో ఉన్నవారు పోలీస్ స్టేషన్లకు వెళ్లిన.. ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన సరే కనీస స్పందన ఉండదనేది ప్రధాన విమర్శ. కానీ తాజాగా ఏపీని తాకిన తుఫాను విషయంలో పోలీసులు, ఇతర శాఖల అధికారులు వ్యవహరించిన తీరుపై ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు జరపడం, మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో తిరగటం, ఎమ్మెల్యేలు కూడా పరుగులు పడడంతో అధికారులు ఎక్కడా అలసత్వం ప్రదర్శించలేదు.
Also Read : శుభకార్యాన్ని పక్కనపెట్టి.. లోకేష్, చంద్రబాబు పని తీరుపై ప్రశంసలు
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పోలీసులు పర్యటించి.. పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, ప్రమాదకరమైన నివాసాలలో ఉండేవారిని ఎప్పటికప్పుడు తరలించారు. ఇల్లు వదిలి వచ్చేది లేదని చెప్పిన వారిని బలవంతంగా అయినా సరే తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సురక్షిత ప్రాంతాలకు ఒక్కొక్కరిని స్వయంగా తరలించేందుకు డిఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఇక రెవెన్యూ శాఖలో ఎమ్మార్వోలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, అటు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా గ్రామాల్లోనే తిరిగారు. తీర ప్రాంతాల్లో చెట్లు విరిగిపడే అవకాశం ఉన్న గ్రామాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు.
Also Read : కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
పునరావస కేంద్రాలకు వెళ్లడానికి ఇష్టపడని వారిని.. అక్కడ సౌకర్యాలు అన్ని బాగున్నాయని, ఆహారంతో ఎటువంటి ఇబ్బందులు లేవని, వైద్య సదుపాయాలు కూడా ఉన్నాయని నచ్చచెప్పి తీసుకువెళ్లారు. అటు గర్భిణీ స్త్రీలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేక వైద్య బృందాలు కూడా రంగంలోకి దిగడంతో వైద్య సదుపాయాలకు కూడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కాకినాడ తీర ప్రాంతంలో ఎక్కువగా నష్టం జరగడంతో.. అధికారులు ప్రజలు ఎవరు తీరప్రాంతానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలసత్వం ప్రదర్శించే అధికారులు కూడా ముందుకు రావడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇక విద్యుత్ స్తంభాలు కూలినచోట ఎక్కడికక్కడ చర్యలు చేపట్టారు విద్యుత్ శాఖ అధికారులు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగడంతో.. పనుల్లో అలసత్వం ప్రదర్శించలేదు.

