అధికారంలో ఉన్న పార్టీలోకి నేతలు మారిపోవడం సర్వ సాధారణం. వ్యాపార లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే కారణంతో సైలెంట్‌గా పార్టీ మారిపోతున్నారు కొందరు నేతలు. అధికారంలో ఉన్న పార్టీ వేధింపులకు గురి చేస్తుందనే భయంతో కొందరు.. తమ వ్యాపారాలు సవ్యంగా సాగాలంటే ప్రభుత్వం అండ తప్పనిసరిగా ఉండాలని కొందరు.. వారి వారి స్వార్థాల మేరకు పార్టీలు మారుతున్నారు. అయితే దీనికి మాత్రం.. ప్రజా ప్రయోజనాలు, కార్యకర్తల అభిష్ఠం మేరకు, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెబుతున్నారు. నిజానికి కార్యకర్తల కోరిక మేరకే అయితే.. నేత కంటే ముందే అభిమానులు పార్టీ మారాలి కదా.. అనే ప్రశ్నకు మాత్రం ఎవరి దగ్గర నో ఆన్సర్.
Also Read : చెవిరెడ్డికి తుడా దెబ్బ.. అరెస్టుకు రెడీ..?
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి పలువురు నేతలు గుడ్ బై చెప్పేశారు. సీటు రాదనే భయంతో కొందరు, సొంత సర్వేల ద్వారా పార్టీ ఓడిపోతుందనే భయంతో కొందరు ఎన్నికల ముందే జగన్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఇక ఎన్నికల తర్వాత మాజీ మంత్రులతో పాటు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా బై బై జగన్ అనేశారు. వాస్తవానికి వీరిలో చాలా మంది తమ స్వార్థం కోసమే పార్టీ మారారు అనేది అందరికీ తెలిసిన విషయమే. స్థానికంగా తెలుగుదేశం పార్టీ నేతలతో ఇబ్బందులు ఉంటే.. అలాంటి వారంతా సైలెంట్‌గా జనసేన, భారతీయ జనతా పార్టీల్లో చేరిపోయారు. దీని వల్ల ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు అనేది ఆయా నేతల ఆలోచన.
Also Read : ట్రంప్ సంచలనం.. 12 దేశాలపై నిషేధం
తాజాగా మరో ఇద్దరు నేతలు కూడా అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా త్వరలో సైకిల్ ఎక్కనున్నట్లు సమాచారం. వాస్తవానికి 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు శిద్ధా రాఘవరావు మంత్రిగా కొనసాగారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన శిద్ధా.. ఆర్థికంగా కూడా పార్టీకి అండగా ఉన్నారనేది వాస్తవం. అయితే 2019 ఎన్నికల్లో దర్శి టికెట్ మరోసారి ఆశించినప్పటికీ.. కాదన్న చంద్రబాబు ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి శిద్ధాను బరిలోకి దింపారు. ఆ ఎన్నికలో ఓటమి తర్వాత శిద్ధా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. గ్రానైట్ వ్యాపారం నిర్వహించే శిద్ధాకు ప్రభుత్వం తరఫు నుంచి ఒత్తిడి పెరగడంతో చేసేది లేక కొద్ది రోజులకు టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత సడన్‌గా జగన్ సమక్షంలో టీడీపీలో చేరారు.
Also Read : చంద్రబాబుపై క్యాడర్ ఫైర్.. ఇదేనా మిజరబుల్ ట్రీట్మెంట్..?
ఐదేళ్లు అధికార పార్టీలో కొనసాగిన శిద్ధా రాఘవరావు.. తన కుమారుడికి దర్శి టికెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టారు. అయితే జగన్ మాత్రం ససేమిరా అనేశారు. వైసీపీ ప్రభుత్వంలో చివరి ఏడాది టీటీడీ బోర్డు సభ్యత్వంతో సరిపెట్టారు. అయితే అప్పట్లోనే శిద్ధాకు టీడీపీ దర్శి టికెట్ ఆఫర్ చేసినట్లు పుకార్లు వినిపించాయి. కానీ రాఘవరావు మాత్రం.. మళ్లీ వైసీపీ గెలిస్తే.. అనే అనుమానంతో పార్టీ మారలేదు. దీంతో దర్శి నుంచి చివరి నిమిషంలో డా.గొట్టిపాటి లక్ష్మిని రంగంలోకి దింపారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. శిద్ధా తన ఆలోచన మార్చుకున్నారు. చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. వైసీపీకి రాజీనామా చేశారు. అయితే స్థానిక నేతలు వ్యతిరేకించడంతో టీడీపీలో చేరిక ఆలస్యమైంది. చివరికి అధినేతను ఒప్పించి.. సైకిల్ ఎక్కేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
Also Read : ఆర్సీబీ సంచలన నిర్ణయం
అవంతీ శ్రీనివాస్ కూడా ఇప్పటికే అన్ని పార్టీలు చుట్టేశారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచిన అవంతి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఇక సరిగ్గా 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఐదేళ్లు ఎంపీగా కొనసాగిన అవంతి.. 2019 ఎన్నికల ముందు జగన్‌కు జై కొట్టారు. భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జగన్ తొలి క్యాబినెట్‌లోనే మంత్రిపదవి దక్కించుకున్నారు. ఆ సమయంలో తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావుతో గొడవ పెట్టుకున్నారు. గంటా వైసీపీలో చేరతారనే ప్రశ్నకు అవంతి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. చివరికి 2024 ఎన్నికల్లో గంటా చేతుల్లోనే ఏకంగా 90 వేల పైగా ఓట్ల తేడాతో అవంతి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన అవంతి.. జనసేన, బీజేపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కూతురు అండతో విశాఖ మేయర్ ఎన్నికలో వైసీపీకి షాక్ ఇచ్చారు. దీంతో అవంతిని చంద్రబాబుకు ఉత్తరాంధ్రకు చెందిన ఓ నేత దగ్గర చేసేందుకు ముమ్మర ప్రయత్నం చేశారు. ఇప్పుడు అవంతికి కూడా టీడీపీలో చేరేందుకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
Also Read : సురేష్ బాబు సంచలన నిర్ణయం.. త్వరలో చంద్రబాబు వద్దకు
త్వరలోనే ఈ ఇద్దరు మాజీలు తిరిగి పసుపు కండువా కప్పుకునే అవకాశం ఉంది. అయితే ఇలాంటి రాజకీయ ఊసరవెల్లులతో జాగ్రత్తగా ఉండాలని కొందరు టీడీపీ నేతలు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం పార్టీలో పదవులు అనుభవించిన నేతలు.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వదిలేసి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి పదవులు ఇవ్వదని కూడా కొందరు సూచిస్తున్నారు. ఇక గంటా వర్గం అయితే.. అవంతి వస్తే ఊరుకునేది లేదంటూ లోకేష్ దగ్గరే వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.