మరక మంచిదే.. ఈ మాట అందరికీ బాగా తెలుసు. అయితే ఇది ఓ టీవీ యాడ్. ఇంకా చెప్పాలంటే బట్టల పైన పడిన మరకను సులువుగా పోగొడుతుందనే మాటకు.. ఈ మాటను అక్కడ ఉపయోగించారు. సర్ఫ్ వాడితే మరక పోతుంది.. కాబట్టి మరక మంచిదే అంటారు. కానీ.. ఏపీ రాజకీయాల్లో మాత్రం.. ఇప్పుడు ఓ మరక గురించే చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ మరక చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే.. వైసీపీలో, ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పిన ఘనత. ఎన్నికల తర్వాత వైసీపీలో ముఖ్యనేతలంతా సైలెంట్ అయ్యారు. కానీ మరక మాత్రం పోలేదు. ఇంకా చెప్పాలంటే.. మరక ఇంకా అలాగే ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూడా మరక మాట చెల్లుతుందనే మాట బాగా వినిపిస్తోంది.
Also Read : అమరావతిపై వైసీపీ కుట్రలు.. పసిగట్టిన ప్రపంచ బ్యాంక్
ఇంతకీ ఏమిటీ “మరక” గోల అనుకుంటున్నారా.. మరదే.. ఈ మరక హవా అంటే.. ఇంతకీ ఈ మరక అసలు పేరు మరకా శివ కృష్ణారెడ్డి. ఊరు కడప జిల్లా వేముల మండలం రాచకుంటపల్లె. అది ఎక్కడా అని ఆలోచించొద్దు. పులివెందుల నియోజకవర్గంలో ఉన్న చిన్న పల్లె. ఆ ఊరు నుంచి వచ్చిన శివకృష్ణారెడ్డి.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో.. కాదు కాదు.. సచివాలయంలో చక్రం తిప్పుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. బిల్లులు ఆగిపోయాయా.. అయితే.. ఎం ఎస్ కే.. సార్‌ను కలవండి.. అని కూడా కొందరు సలహా ఇస్తున్నారు. ఎంఎస్కే.. క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ కాదు.. ఆయనే మరకా శివ కృష్ణారెడ్డి.
వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఈ శివ కృష్ణారెడ్డి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటు కూడా. మహా మహా వాళ్లకు కూడా ప్యాలెస్‌లోకి ఎంట్రీ లేదు. కానీ శివ కృష్ణారెడ్డి మాత్రం నేరుగా వెళ్లగలిగేంత చనువు. మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా జగన్ అపాయింట్మెంట్ కోసం రోజులు, వారాల తరబడి ఎదురు చూసిన సందర్భాలున్నాయి. కానీ మన “మరకా” మాత్రం.. అన్నతో మాట్లాడి వస్తా.. అని నేరుగా వెళ్లిపోతారు. అంత సన్నిహితుడు కాబట్టే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో నిపుణుడు.. అనే పదవిని ఇచ్చి సత్కరించారు. నిజానికి చదివింది డిగ్రీ మాత్రమే. లా చదువు మధ్యలో ఆపేశారు. అయినా సరే.. తీర్పులు ఇవ్వగలరు.
Also Read : జడ్పీ ఛైర్మన్ల సందడి.. కూటమి అగ్ర నేతల కీలక భేటీ..!
ఇక అసలు విషయం ఏమిటంటే.. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి పరిచయాలను ఇప్పటికీ మరకా శివకృష్ణారెడ్డి తనకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. వైసీపీ ఓడిన తర్వాత ముఖ్యనేతలతో పాటు.. అధినేత వైఎస్ జగన్ కూడా.. తాడేపల్లి నుంచి బెంగళూరుకు మకాం మార్చారు. కానీ.. మన మరకా శివ కృష్ణారెడ్డి మాత్రం.. విచిత్రంగా తన మకాం పులివెందుల నుంచి.. తాడేపల్లికి మార్చేశారు. తాడేపల్లి నుంచే తన పనులు చక్కబెడుతున్నారు. ఆర్థిక శాఖలో మంచి పరిచయాలు ఉన్నాయి.. బిల్లు ఆగిందా.. అయితే చేసిపెడతాం.. మనం ఎంత చెబితే.. అంత.. అయితే కాస్త ఖర్చు అవుతుంది.. అంటూ పైరవీలు చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఈ మరక చెబితే కొంత మంది పనులు చకచకా చేసేస్తున్నారు. అందుకు కారణం.. వారి బలహీనతలే.
మరకా శివకృష్ణారెడ్డి మీద మరో ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే ఉద్యోగాలిప్పానంటూ మోసం చేశారనే మాట. అది కూడా ఎక్కువగా మహిళలు, యువతులే మరక జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. తన పనుల కోసం ఉద్యోగం కోసం వచ్చిన మహిళలను వాడుకుంటున్నారని.. వారిని భయపెడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. బాధిత మహిళలు.. ఈ మరక పైన పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం ఏపీ సచివాలయంలో పెద్ద దుమారం రేపుతోంది కూడా. మరక మంచిదే అని సన్నిహితంగా మెలిగిన అధికారులంతా ఇప్పుడు ఆ మరక మనకంటుకంటే.. అని భయపడుతున్నారు. మరి ఈ “మరక” ను ఇప్పటికైనా సర్ఫ్ ఎక్స్ ఎల్తో ఉతుకుతారా.. లేక మరకే కదా అని ఊరుకుంటారా.. చూడాలి.


