హైదరాబాద్‌లోని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానంలో పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన ఈ కేసులో వైఎస్ జగన్, దాల్మియా సిమెంట్స్ సంస్థతో పాటు పలువురు నిందితులపై ఈడీ అభియోగపత్రాన్ని సమర్పించింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లిలోని ప్రత్యేక సీబీఐ కోర్టు పరిశీలనకు స్వీకరించింది.
Also Read : దేశంలోనే తొలి స్వదేశీ బర్డ్‌ఫ్లూ వ్యాక్సిన్..!
అభియోగపత్రంలోని అంశాలు, సాక్ష్యాధారాలను న్యాయస్థానం పరిశీలిస్తోంది. కోర్టు పరిశీలన పూర్తయిన తర్వాత నిందితులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. గతంలో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ విచారణను ముమ్మరం చేసి, నిధుల మళ్లింపుపై లోతుగా దర్యాప్తు జరిపింది. ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాల్మియా సిమెంట్స్ సంస్థకు కడప జిల్లాలో సుమారు 407 హెక్టార్ల సున్నపురాయి గనుల లీజును కేటాయించారు.
Also Read : అమరావతిపై వైసీపీ కుట్రలు.. పసిగట్టిన ప్రపంచ బ్యాంక్
దీనికి ప్రతిఫలంగా వైఎస్ జగన్‌కు చెందిన రఘురాం సిమెంట్స్, కార్మెల్ ఆసియా హోల్డింగ్స్ సంస్థల్లో దాల్మియా సిమెంట్స్ దాదాపు రూ. 95 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. హవాలా మార్గాల ద్వారా కూడా నిధుల బదిలీ జరిగినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. కాగా, ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో గతంలోనే ఈడీ కఠిన చర్యలు తీసుకుంది. వైఎస్ జగన్‌కు చెందిన వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో పాటు దాల్మియా సిమెంట్స్ సంస్థకు చెందిన ఆస్తులను కూడా అప్పట్లో ఈడీ అటాచ్ చేసింది. తాజాగా ఇదే కేసులో పూర్తిస్థాయి ఆధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.


