భారతదేశంలో చట్టాలు అందరికీ సమానమే. నేరం ఎవరు చేసినా శిక్ష ఒకటే. భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఒకే న్యాయం ఉంది. చట్టం ముందు డబ్బులున్న వాడైనా, నిరుపేదైనా, రాజకీయ నేత అయినా.. సామాన్యుడైనా సరే.. అందరూ సమానమే. ఇది గతంలో చాలా సార్లు రుజువు కూడా అయ్యింది. బడా పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్థాయి వ్యక్తులు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులు కూడా న్యాయస్థానం ముందు హాజరైన వారే. కోర్టు చేతుల్లో మొట్టికాయలు తిన్న వారే. తప్పు చేసినట్లు వచ్చిన ఆరోపణలకు రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారే. గతంలో భారత ప్రధానిగా పని చేసిన పీవీ నరసింహారావు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు మాజీ సీఎం జయలలిత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎలాంటి హడావుడి లేకుండా కోర్టులకు హాజరయ్యారు. న్యాయమూర్తి చెప్పినట్లుగా నడుచుకున్నారు. కోర్టు వాయిదాలకు హాజరయ్యే సమయంలో సాదా సీదాగా వెళ్లారు తప్ప.. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాదిరిగా హంగామా చేయలేదు. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా నాంపల్లి సీబీఐ కోర్టు ముందు హాజరైన జగన్.. చట్టాలకు అతీతంగా వ్యవహరించారు.
Also Read : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు..!
నిజానికి సుద్ద పూస కాదు. 2004 నుంచి 2009 మధ్య తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించారనేది ప్రధాన ఆరోపణ. ఇందుకు ఆ రెండు ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ పత్రాలే ప్రత్యక్ష ఉదాహరణ. 2004 నాటి ఆస్తులకు, 2009 నాటి ఆస్తులకు ఏ మాత్రం పొంతన లేదు. ఇందిరా టెలివిజన్, సాక్షి పత్రిక, సండూర్ పవర్, భారతీ సిమెంట్ వంటి సంస్థలు ఈ ఐదేళ్లల్లోనే కొత్తగా పుట్టుకొచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ జగన్ అక్రమాస్తులపై దర్యాప్తు చేపట్టాయి. 11 సీబీఐ ఛార్జిషీట్లు, 9 ఈడీ ఛార్జిషీట్లలో తీవ్రమైన ఆర్థిక నేరంలో ఏ1గా జగన్ ఉన్నారు. 43 వేల కోట్లకు పైగా అవినీతి నిర్దారించబడి 16 నెలలు జైలులో రిమాండ్ ఖైదీగా జీవితం గడిపిన వ్యక్తి.. 6 సంవత్సరాల తర్వాత కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో జగన్ రెడ్డి వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందనేది వాస్తవం.
అసలు ఒకటే పెద్ద ప్రశ్న.. ఏం ఘన కార్యం చేశారని ర్యాలీ.. ఏం సాధించినందుకు భారీ కాన్వాయ్.. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి సీబీఐ కోర్టు వరకు అద్దెకు తెచ్చుకున్న అభిమానులతో ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం ఏమిటీ..? ఇక దారి పొడవునా 2029లో రప్పా రప్పా అంటూ స్లోగన్స్‌తో ఫ్లెక్సీలు కట్టడం దేనికి సంకేతం..? ఎవర్ని బెదిరించడానికి ఈ రప్పా రప్పా డైలాగులు.. దారి పొడవునా స్లోగన్స్ చేసుకుంటూ పోవడానికి అదేమీ విజయోత్సవ ర్యాలీ కాదు. అక్రమాస్తుల కేసులో కోర్టు వాయిదాకు వెళ్తున్న ముద్దాయి జగన్ రెడ్డి. ఈ విషయం ఎలా మర్చిపోయారు. క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే.. హోదాలతో సంబంధం లేకుండా న్యాయస్థానాల ముందు విచారణకు హాజరవ్వాల్సిందే. కానీ జగన్ రెడ్డి మాత్రం.. అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. జగన్ పైన కేసులు నమదైంది 2012లో.. అంటే ఇప్పటికి సుమారు 13 ఏళ్లు దాటింది. ఓ 16 నెలలు మాత్రం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. నాటి నుంచి ప్రతి శుక్రవారం వాయిదాలకు వెళ్తున్నారు.
Also Read : భారత్ పై పాక్ దే విజయం.. అమెరికా సంచలన కామెంట్
కానీ తీవ్ర ఆర్థిక నేరాల్లో నిందితుడిగా ఉన్న జగన్.. ఆరేళ్లు ట్రయల్ కోర్టులో విచారణకు హాజరు కాకుండా కుంటి సాకులు చెప్పారు. దీని వల్ల కేసుల విచారణను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారనే విషయం స్పష్టం అవుతోంది. ఆరేళ్లల్లో విదేశాలకు వెళ్లి వచ్చారు.. ఎన్నికల్లో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. కానీ పక్క రాష్ట్రంలో జరిగే కేసు విచారణకు హాజరయ్యేందుకు మాత్రం సమయం లేదన్నారు. ఇక కోర్టుకు తప్పనిసరిగా హాజరవ్వాలని ఉత్తర్వులు ఇస్తే.. నాకు ప్రత్యేక ఇబ్బందులు ఉన్నాయి.. కాబట్టి మినహాయింపు ఇవ్వండి.. అని లేఖ రాశారు. లేదు.. మీరు తప్పని సరిగా రావాలంటే వస్తా అంటూ లేఖలో వేడుకున్నారు జగన్. కానీ కోర్టు మాత్రం ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. తప్పనిసరిగా హాజరవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయినా సరే.. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా న్యాయ వ్యవస్థకే సవాల్ విసిరేలా జగన్ రెడ్డి వ్యవహరించడం నిజంగా సిగ్గు చేటు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు రావాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని.. తాను కాలు బయటపెడితే 60 లక్షలు ఖర్చు అవుతాయని కోర్టుకు చెప్పి మినహాయింపు పొందిన జగన్ రెడ్డి.. ఇప్పుడు మాత్రం బెంగళూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వరకు స్పెషల్ చార్టెర్డ్ విమానంలో ఎలా వచ్చారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అప్పుడు లేని డబ్బులు.. ఇప్పుడు ఎలా వచ్చాయి.. అంటే.. ఏమో మరి. ఇక ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిందే అంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే.. జగన్ వస్తున్నారు కాబట్టి.. బలప్రదర్శన చేయాలంటూ రెండు రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ పెద్దల డైరెక్షన్ అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. కనీసం ఒక్క చోట కూడా పోటీ చేయన తెలంగాణలో వైసీపీ నేతల బలప్రదర్శన ఏమిటో అంటే.. దీని వెనుక మర్మం ఏమిటో వైసీపీ పెద్దలే చెప్పాలి. అరువు తెచ్చుకున్న అభిమానులతో సీఎం, సీఎం అని తెలంగాణలో అరుపులేమిటనేది అర్థమే కావటం లేదు.
Also Read : సిఎం మార్పు ఖాయమే..? వదలని డిప్యూటి సిఎం..!
అన్న కోర్టుకు వస్తే.. శాంతిభద్రతల సమస్య వస్తుందనేది పరోక్షంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు జగన్ తరఫు న్యాయవాదులు. కోర్టు బయట కట్టడి చేసేందుకు పోలీసులు నానా పాట్లు పడుతున్నారు.. కావాలంటే బయటకు వచ్చి చూడండి సార్.. అని కూడా రేపు చెబుతారేమో. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పరోక్షంగా కోర్టులను హెచ్చరించడమే ఈ బలప్రదర్శన వెనుక అసలు మర్మం. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్లు, తానే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడింతలు దోపిడీతో 3 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారనేది విపక్షాల ఆరోపణ. నిజానికి కేసుల విచారణలో జాప్యం వెనుక జగన్ అవినీతి సామ్రాజ్యం గురించి వాస్తవాలు బయటకు రాకూడదనే ఉద్దేశం అనేది బహిరంగ రహస్యం.
నిజానికి జగన్ కష్టపడి సంపాదించిన ఆస్తి ఒక్కటైనా ఉందా అంటే.. నో అనే సమాధానమే వస్తుంది. అన్నీ క్విడ్ ప్రోకోలో భాగంగా సంపాదించిన ఆస్తులే. జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులన్నీ మోసపూరితమే. పారిశ్రామికవేత్తలను బెదిరించి పెట్టుబడులు పెట్టించుకున్నారనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కూడా జగన్ రెడ్డి బెదిరింపు ధోరణితోనే అదే అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. కేసుల విచారణ ముందుకు సాగకూడదనే ఉద్దేశంతో వాయిదా పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు వేస్తూ జాప్యం చేస్తున్నారు కూడా. ఇక న్యాయవ్యవస్థ పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆక్షేపణీయం. 2019-24 మధ్య న్యాయస్థానాలపైన, న్యాయమూర్తుల పైన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, దూషణలు, అసభ్య పదజాలంతో పోస్టింగుల వైసీపీ పెద్దల హస్తం ఉంది. ఇప్పుడు కోర్టులను, న్యాయవాదులను సవాల్ చేసేలా భారీ ర్యాలీతో హజరవ్వడం వెనుక కూడా ఇదే తరహా కుట్ర ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

