చెప్పాడంటే… చేస్తాడంతే… ఈ మాట ఐదేళ్లు తెగ పాపులర్ చేశారు వైసీపీ నేతలు. చివరికి 2024 ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే మాట సరిగ్గా అంతకు ఐదేళ్లు క్రితం… నేను విన్నాను… నేనున్నాను.. అంటూ భరోసా ఇచ్చారు జగన్. ఇదే భరోసా 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు తెప్పించింది. అయితే చెప్పాడంటే.. చేస్తాడంతే అంటూ 2024 ఎన్నికల్లో చేసిన స్లోగన్ మాత్రం… ఏ మాత్రం వర్కవుట్ కాలేదు. ఇందుకు ప్రధానంగా ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చిన హామీలు వేరు… అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులు వేరు. రాజధాని సహా, ఎన్నో కీలక హామీల్లో జగన్ మాట మార్చాడు. అమ్మఒడిలో కోత, కరెంట్ ఛార్జీల పెంపు.. ఇలా ఎన్నో విషయాల్లో జగన్ మాట తప్పాడనేది ఏపీ ప్రజల భావన.
Also Read : తిరుపతిలో తీవ్ర విషాదం..!
ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ పేరు పరదాల సీఎంగా మారిపోయింది. నాలుగేళ్ల పాటు కనీసం పార్టీ కార్యకర్తలకు జగన్ ముఖం కూడా కనిపించలేదు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు పూర్తిగా ప్యాలెస్‌కు పరిమితమయ్యారు. ఆ తర్వాత కూడా పరదాల మధ్య పర్యటించారు. ఇక ఏదైనా పని కోసం వచ్చిన నేతలకు కూడా తాడేపల్లి ప్యాలెస్‌లో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. పని కావాలంటే… నాటి సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాల్సిందే. ఇక సీఎంఓలో అయితే జవహర్‌రెడ్డి చెప్పిందే ఫైనల్. ఉన్నతాధికారులతో రివ్యూలు తప్ప… సామాన్య కార్యకర్తలకు జగన్ దర్శన భాగ్యం లభించలేదు.
ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి తన మకాం బెంగళూరు ప్యాలెస్‌కు జగన్ షిఫ్ట్ చేశాడు. నెలకోసారో లేక రెండుసార్లో ఏదో చుట్టపు చూపుగా తాడేపల్లి వస్తున్నారు జగన్. అలా రావడం… ఓ రెండు రోజులు నేతలతో మాట్లాడటం… మళ్లీ విమానం ఎక్కి బెంగళూరు వెళ్లిపోవడం… దాదాపు 7 నెలలుగా ఇదే జరుగుతోంది. పార్టీలో కొందరు సీనియర్ నేతలతో రివ్యూలు నిర్వహిస్తున్న జగన్… కార్యకర్తలకు దూరమవ్వడం వల్లే పోటీ ఓడిపోయినట్లు గుర్తించారు. అంత వరకు బాగానే ఉంది. ఇప్పటి వరకు జిల్లాల్లో ముఖ్య నేతలను తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించి సమావేశమయ్యారు. దీనివల్ల వాస్తవ పరిస్థితులు తెలియవని కొందరు సలహాలివ్వడంతో… నేరుగా కార్యకర్తల నుంచే అభిప్రాయాలు సేకరించాలని జగన్ నిర్ణయించారు.
Also Read : బాలయ్య సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాలో ప్రసంశలు
అందుకే కార్యకర్తలతో జగనన్న.. అనే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు. ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు బస చేయనున్న జగన్… జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో విడివిడిగా భేటీ కావాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి తర్వాత నుంచి ప్రారంభిస్తామని ప్రకటించాడు. అయితే కార్యకర్తలతో జగనన్న కార్యక్రమం ఇప్పుడు వాయిదా పడినట్లు తెలుస్తోంది. జనవరి 3వ వారంలో ప్రారంభిస్తామని ప్రకటించిన వైసీపీ నేతలు… అది ఫిబ్రవరి రెండు వారంలో షెడ్యూల్ చేసినట్లు చెబుుతున్నారు. దీనిపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు పరీక్షల సమయం కావడంతో… అంతా పిల్లల చదువులపై ఫోకస్ పెడతారని… అలాంటప్పుడు రివ్యూలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుందంటున్నారు.