భారతదేశంలో వైద్య విద్య, ప్రజా ఆరోగ్యం ఒక కీలక మలుపులో ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఖజానాపై పెరుగుతున్న భారం, మరోవైపు అత్యాధునిక వైద్యం కోసం సామాన్యుడి ఆరాటం. ఈ రెండింటినీ సమన్వయం చేసే శక్తి ‘ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య’.. PPP నమూనాకు ఉందని చిత్తూరు అనుభవం నిరూపిస్తోంది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో గ్రూప్ లీజు ప్రాతిపదికన గత చంద్రబాబు హయాంలో తీసుకోవడంపై తొలినాళ్లలో విమర్శలు వచ్చినా, నాటి ప్రతిపక్ష వైసీపీ నేతలు గగ్గోలు పెట్టినా.. నేడు అక్కడి ఫలితాలు ఒక విజయవంతమైన కేస్-స్టడీగా నిలుస్తున్నాయి.
చిత్రమేమిటంటే, అప్పట్లో చంద్రబాబును విమర్శించిన జగన్.. తన ఐదేళ్ల హయాంలో చిత్తూరు ఆసుపత్రిని లీజు తీసుకున్న అపోలో మీద పల్లెత్తు మాట అనలేదు. కేవలం యాజమాన్యం పట్ల సామాజిక వర్గ అభిమానమా? లేక అక్కడ నాణ్యతలో వచ్చిన విప్లవాత్మక మార్పును చూసి మౌనంగా ఉండిపోయారా? అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. చిత్తూరు ఆసుపత్రి ఫలితాలు గమనించిన ప్రభుత్వం.. ఏపీలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంగా చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ఇప్పుడు మరింత కట్టుదిట్టమైన పీపీపీ విధానం కూడా అమలు చేస్తోంది. దీని ద్వారా మరిన్ని జిల్లాలకు మేలు జరుగుతుంటే, జగన్ మాత్రం.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే “జైళ్లకు పంపిస్తాం” అంటూ బెదిరింపులకు దిగడం రాజకీయ ఉన్మాదం కాక మరేమిటి?
Also Read : కేంద్రం కంటే ముందు ఆంధ్ర..!
నిజానికి పీపీపీ విధానంపై వైసీపీ ద్వంద్వ విధానం అమలు చేస్తోంది. ఏపీలో పీపీపీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసీపీ పెద్దలు.. కేంద్రంలో మాత్రం దీనిని సూపర్ అంటున్నారు. పార్లమెంటరీ స్థాయి సంఘంలో తమ తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి సభ్యుడిగా పీపీపీని సమర్థించిన కమిటీ నివేదికను, కోర్టుల తీర్పులను, నీతి ఆయోగ్ నమూనాను ఇప్పటికే బయట పెట్టారు. దీనిని తప్పుపట్టే ధైర్యం ఆ పార్టీ నేతలకు, అధినేత జగన్‌కు లేదనే చెప్పాలి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచ దేశాలు కఠిన చర్యలు తీసుకుంటుంటే.. జగన్ మాత్రం.. పారసిటమల్ వేసుకుంటే చాలు.. బ్లీచింగ్ పౌడర్ కొట్టుకోవాలి.. అంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వ పెద్దలు మాత్రం.. కరోనా వచ్చిన వెంటనే.. ఏపీలో ఉండకుండా.. సైలెంట్‌గా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వెళ్లిపోయారు. అంటే ఏపీలో జగన్ పాలనలో మెరుగైన వైద్యం అందుబాటులో లేదు అని ఆ పార్టీ నేతలే స్వయంగా చెప్పినట్లు అయ్యింది. జగన్ పాలనకు ప్రజలు ఓటుతో చరమగీతం పాడినా సరే.. ఇప్పటికీ రప్పా రప్పా అంటూ బెదిరిస్తూనే ఉన్నారు జగన్ సహా వైసీపీ నేతలు, కార్యకర్తలు.
Also Read : నెల్లూరులో రౌడీల పరార్.. కథ మారుతోంది..!
పీపీపీ విధానంలో చిత్తూరు జిల్లా ఆసుపత్రిని అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి ఏపీ సర్కార్ అప్పగించింది. అపోలో పర్యవేక్షణలోకి వెళ్లిన తర్వాత.. అది కేవలం ఆసుపత్రిగా కాకుండా ఒక ఉన్నత స్థాయి బోధనా సంస్థగా.. AIMSR స్థాయికి ఎదిగింది. చిత్తూరు అపోలో ఒక విజయవంతమైన నమూనాగా మారింది కూడా. ప్రముఖ విద్యా పోర్టల్స్‌లో ఈ కళాశాలకు టాప్ రేటింగ్ దక్కింది. శిక్షా విద్యా పోర్టల్స్‌లో ఈ కళాశాలకు 4.1 నుంచి 4.6/5 రేటింగ్ లభిస్తోంది. ఇక ఈ ఆసుపత్రి 300 పడకల స్థాయి నుంచి 850 పడకల భారీ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. రోజుకు 1000-2200 మంది రోగులకు 21కి పైగా స్పెషాలిటీ విభాగాల్లో చికిత్స అందుతోంది. ఇక పీపీపీ వల్ల ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. పీపీపీ విధానంలో ప్రభుత్వం నియంత్రణ కోల్పోదు. కొత్త నిబంధనల ప్రకారం కన్వీనర్ కోటా కింద గతంలో కంటే ఎక్కువ సీట్లు కేటాయించబడతాయి. ఆల్ ఇండియా కోటా ఇవ్వాల్సిన పని లేకుండా, మన రాష్ట్ర మెరిట్ విద్యార్థులకే తక్కువ ఫీజుతో నాణ్యమైన సీట్లు దక్కుతాయి.
జగన్ హయాంలో ఆక్సిజన్ అందక సంభవించిన విషాదాలు పీపీపీ ఆసుపత్రుల్లో పునరావృతం కావు. ప్రైవేట్ యాజమాన్య నిర్వహణలో ఆక్సిజన్ ప్లాంట్లు, ఆధునిక పరికరాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఆసుపత్రుల నిర్మాణానికి ఆదా అయ్యే వేల కోట్లను ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలకు, మందుల సరఫరాకు, గ్రామాలను దత్తత తీసుకుని ‘కమ్యూనిటీ వైద్యం’ అందించడానికి వెచ్చించవచ్చు. వైద్యం అనేది నాణ్యత లేనిదిగా, మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడేలా ఉండకూడదు. ప్రభుత్వం ‘యజమాని’ స్థానంలో కాకుండా ‘నియంత్రణ అధికారి’గా ఉంటే అద్భుతాలు సాధించవచ్చని చిత్తూరు అపోలో నిరూపించింది. రాజకీయ విమర్శలకు అతీతంగా, పారదర్శక నమూనాలతో ప్రభుత్వ ఆసుపత్రులను ప్రాణదాతలుగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

