ఆంధ్రప్రదేశ్ లో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి తెలుగుదేశం లేదా జనసేన పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయి నాయకత్వం వైసీపీ అధినాయకత్వంపై లేదంటే నియోజకవర్గ స్థాయి నాయకత్వంపై ఆగ్రహంగా ఉంటూ పార్టీలు మారే ప్రయత్నం చేస్తుంది. ఇది క్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటుంది అనే భావన కలుగుతుంది. ఉదాహరణకు జగ్గయ్యపేట నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఇటీవల కాలంలో జనసేన పార్టీలోకి వెళ్లారు.
Also Read : ఫాంలోకి వచ్చిన కెప్టెన్.. మరి మాజీ కెప్టెన్..?
సామినేని ఉదయభాను పార్టీ మారిన తర్వాత.. జనసేన పార్టీలోకి వైసిపి నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. అయితే గ్రామాల్లో ఇది ఇబ్బందికరంగా మారుతుంది. గత ఐదేళ్లు పెత్తనం చెలాయించిన ఆ వైసిపి మాజీ కార్యకర్తలు.. ఇప్పుడు మళ్లీ అదే కొనసాగిస్తున్నారనే ఆగ్రహం టిడిపి క్యాడర్ లో వ్యక్తమవుతోంది. ఇక ఒక మంత్రికి చెందిన నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు టిడిపిలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఆ నాయకత్వమే నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తోంది.
Also Read : రాప్తాడులో మునుగుతున్న వైసీపీ నావ
మంత్రి ఎక్కువగా విజయవాడలో ఉండటంతో.. వైసిపి నుంచి టిడిపిలోకి వచ్చిన మండల.. గ్రామస్థాయి నాయకత్వంతో పాటుగా కార్యకర్తలు కూడా హడావిడి చేయడం మొదలుపెట్టారు. ఇక చిన్న చిన్న కాంట్రాక్టులను తీసుకోవడంతో పాటుగా అధికారులను కూడా ఆదేశించడం వంటివి జరుగుతున్నాయి. రాయలసీమలో ఓ నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇటీవల టిడిపిలోకి వచ్చిన కొంతమంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా తమ పెత్తనం కొనసాగించడం గమనార్హం. చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. పార్టీ ఆఫీసుకు వెళ్తే అక్కడ వైసీపీ మాజీ నేతల హడావుడి చూసి కంగు తింటున్నారు. దీనిపై కూటమి పార్టీల అధినేతలు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా క్యాడర్ లో వ్యతిరేకతకు కారణం అవుతుందని కార్యకర్తలు కోరుతున్నారు.