రాష్ట్ర రాజకీయాల్లో ఎదగడానికి బలమైన అవకాశాలు ఉన్నప్పటికీ, జనసేన పార్టీ వాటిని ఎంతవరకు వినియోగించుకుంటుందన్న ప్రశ్నలు ప్రస్తుతం బాగా వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా వ్యవహరించిన జన సైనికులు, నేతలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం అదే స్థాయి కార్యాచరణ కొనసాగించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకున్న నాయకులు, ప్రస్తుతం కనీసం కనిపించడం లేదనే ఆరోపణలు ప్రజల్లో బాగా వినిపిస్తున్నాయి. కూటమిలో భాగస్వామ్యం ఉన్నప్పటికీ, సమస్యల పరిష్కారంలో జనసేన నేతల చొరవ ఆశించినంతగా లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
Also Read : అమరావతి.. వైసీపీ స్టాండ్ ఏమిటీ..?
రాష్ట్రంలో టీడీపీ తరువాత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీగా జనసేన నిలిచింది. అలాగే ఇద్దరు, ముగ్గురు మంత్రులు ప్రభుత్వంలో కొనసాగుతున్నారు కూడా. అయితే ప్రస్తుతం జనసేన పార్టీకి చెందిన అంశాలను పరిశీలిస్తే.. ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు కాస్త దూరంగా ఉన్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. కూటమి సర్కార్‌లో భాగస్వామ్యులు అయినప్పటికీ.. ముఖ్యంగా టీడీపీ నేతలను కలుపుకుని పోవటంలో జనసేన నేతలు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. వచ్చిన అవకాశాలను వినియోగించుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తేనే పార్టీ బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా పంచాయతీ శాఖకు సంబంధించిన సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఆ శాఖను నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలపై దృష్టి పెట్టి, వేగంగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటే.. జనసేనపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగే అవకాశముంది. అదే విధంగా ఇతర శాఖల మంత్రులు కూడా తమ పరిధిలోని సమస్యలను పరిష్కరించడంలో చురుకుదనం చూపాల్సిన అవసరం ఉంది.
Also Read : పాక్ ఉగ్రవాదులకు స్వర్గం.. అమెరికా సంచలన నివేదిక..!
గ్రామీణ రహదారుల సమస్య బాగా ఎక్కువగా ఉంది. అనేక గ్రామాల ప్రజలు రోడ్ల కోసం వినతులు అందజేస్తున్నప్పటికీ, పరిష్కారంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. ఈ సమస్యలను జనసేన స్థానిక నాయకులు సమగ్రంగా సేకరించి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడితే గ్రామ స్థాయిలో పార్టీకి మంచి పట్టు ఏర్పడే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో స్పష్టమైన అభివృద్ధి పనులు చేపడితే, ప్రజలు ఆ నాయకత్వాన్ని మళ్లీ ఆదరించే అవకాశముంది. లేదంటే అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోలేకపోతే, భవిష్యత్తులో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారాల కంటే.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే పదవికి న్యాయం చేసినట్లవుతుంది. అదే సమయంలో పార్టీకి దీర్ఘకాలిక లాభం కూడా చేకూరుతుంది. జనసేన పార్టీ ఈ అవకాశాలను ఎలా మలుచుకుంటుందో చూడాల్సి ఉంది.

