ఏపీలో వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారనేది ఆ పార్టీ నేతల మాట. ఇందుకు తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చేయని తప్పును కూడా చేసినట్లు ఒప్పించాలని పోలీసులు వేధిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. తమ కార్యకర్తలను బెదిరించి భయపెట్టాలని పోలీసులు చూస్తున్నారని వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు.
కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో అంజాద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. పీఏ ఖాజా సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన కడప పోలీసులు ఖాజాను హైదరాబాద్‌లో అరెస్టు చేసి కడపకు తీసుకువచ్చారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యాలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని అధికార పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.
Also Read: హెచ్ 1 బీలకు మరో షాక్ తప్పదా..?
అయితే ఇక్కడే అసలు సూత్రధారులను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి వైసీపీ నేతల అండతోనే కార్యకర్తలు రెచ్చిపోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. తమ నేత అండ లేకుండా ఏ ఒక్క కార్యకర్త కూడా ఎదుటి పార్టీ నేతలను దూషించే ధైర్యం చేయరు. పైగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత కూడా ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే.. ఏం జరిగినా సరే.. తమ నేత చూసుకుంటారనే ధీమా. ఇక కొంతమంది కార్యకర్తల పరిస్థితి అయితే విచిత్రంగా ఉంది. నేతలు చెప్పిన వెంటనే.. ముందు వెనుక చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలను దూషిస్తున్నారు కూడా. కొన్ని నియోజకవర్గాల్లో అయితే దాడులకు కూడా తెగబడుతున్నారు.
ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఖాజా చేసిన వ్యాఖ్యల వెనుక అంజాద్ బాషా, ఆయన సోదరుడు ఉన్నాడనేది వాస్తవం. ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి అంజాద్ బాషా సోదరుల తీరు ఇలాగే ఉంది. బాషా సోదరుడిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ.. బెయిల్ పై బయటకు వచ్చారు. అయినా ఆయన తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఎమ్మెల్యే మాధవి రెడ్డికి వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
Also Read: భారత ప్రజలు అవమానం ఒప్పుకోరు.. పుతిన్ సంచలన కామెంట్స్..!
ఇటు పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపై కూడా పోలీసులు ఉదారంగా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట రామిరెడ్డిపైన ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చంద్రయ్య హత్య వెనుక పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారనేది టీడీపీ నేతల ఆరోపణ. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వెల్దుర్తి మండలం గుండ్లపాడు వద్ద జరిగిన జంట హత్యల వెనుక కూడా పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఎన్నికల తర్వాత వెంకట రామిరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారనేది పోలీసుల మాట. కానీ అసలు విషయం ఏమిటంటే.. వెంకట రామిరెడ్డి గురించి పోలీసులకు పూర్తి సమాచారం తెలుసు. కానీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు అనేది టీడీపీ నేతల ఆరోపణ.
ఖాజా అరెస్టుపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నారనేది వాస్తవం. పైకి కనిపించే వారిని అరెస్టు చేస్తున్నారు తప్ప.. తెర వెనుక సూత్రధారుల జోలికి మాత్రం వెళ్లటం లేదని ఆగ్రహంతో ఉన్నారు. అంజాద్ బాషా, పిన్నెల్లి బ్రదర్స్.. ఇలా ఎంతో మంది వైసీపీ నేతల అరాచకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని.. వీటిని అడ్డుకోవాలంటే సూత్రధారులను బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నారు.