తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు తీవ్రంగా భయపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో కొందరు నేతలు పదవులపై గంపెడాశ పెట్టుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటినప్పటికీ.. నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి కాలేదు. ఈ నెలాఖరు నాటికి అన్ని పదవులు భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు కూడా. అయితే పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికే పదవులుంటాయని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో తమ పేర్లు ఉంటాయో ఉండవో అని కొందరు నేతలు భయపడుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీలో సీనియర్ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
Also Read : అమరావతికి మోడీ.. ప్రధాని కార్యాలయం కీలక ప్రకటన
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఇప్పుడు టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 5 స్థానాల్లో ఒకటి జనసేనకు, ఒకటి బీజేపీకి, 3 తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. జనసేన తరఫున నాగబాబు, బీజేపీ తరఫున సోము వీర్రాజు, టీడీపీ తరఫున కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు ఎన్నికయ్యారు. ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే టీడీపీ తరఫున అభ్యర్థుల ఎంపిక తెలుగు తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వాస్తవానికి ఎమ్మెల్సీగా అవకాశం కోసం చాలామంది పోటీ పడ్డారు. పార్టీలో పలువురు సీనియర్ నేతలు కూడా ఎమ్మెల్సీ పదవి ఆశించారు. పలువురి పేర్లు దాదాపు ఖరారు అనే మాట కూడా బలంగా వినిపించింది. కానీ అభ్యర్థుల ప్రకటన తర్వాత అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు జాబితాలో లేని వారిని ఎమ్మెల్సీ పదవులు వరించాయి.
Also Read : ఎమ్మెల్యేలకు రేవంత్ క్లాస్.. గేర్ మార్చిన సీఎం
నామినేటెడ్ పదవుల జాబితాలో యువతకు, వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. దీని వల్ల అన్ని వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. అదే సమయంలో సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టినట్లైంది కూడా. దీంతో పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇదే ఫార్ములా వాడారు. యువతకు పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చారు. అలాగే మంత్రివర్గంలో కూడా సీనియర్లకు కాకుండా.. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికే అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎంపికలో కూడా సేమ్ ఫార్ములా. దీంతో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న సీనియర్లు భయపడుతున్నారు. తొలి జాబితాలో మాత్రమే సీనియర్ల పేర్లు కనిపించాయి. రెండో జాబితాలో మాత్రం అంతా కొత్తవారే. దీంతో మూడో జాబితాలో అయినా తమ పేర్లు ఉంటాయో ఉండవో అని సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీట్లు త్యాగం చేసిన వారు, పార్టీలో ఏళ్ల తరబడి పని చేస్తున్న వారితో పాటు కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నేతలు తమకు పదవులు వస్తాయో రావో అని చర్చించుకుంటున్నారు. కొంతమంది నేతలు మాత్రం.. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు అంటున్నారు.