Tuesday, February 17, 2026 03:24 PM
Tuesday, February 17, 2026 03:24 PM

దక్షిణ కోస్తా జోన్ కూతకు ముహూర్తం ఖరారు..!

విభజన హామీల్లో ఒకటైన విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా కూడా.. ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు. దీంతో అసలు విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటవుతుందా.. లేదా.. అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇక జోన్ ప్రకటన తర్వాత.. పక్కనే ఉన్న ఒడిశా నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు, విజ్ఞాపనలు రావడంతో.. జోన్ ఏర్పాటు ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో కొంతకాలంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అంశం స్తబ్దుగా ఉండిపోయింది. తాజాగా కూటమి ప్రభుత్వ కృషి వల్ల దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు ప్రక్రియలో
మళ్లీ కదలిక కనిపిస్తోంది. త్వరలోనే జోన్ కార్యకలాపాల ప్రారంభానికి అపాయింటెడ్ డేట్‌ ప్రకటించే అవకాశం ఉందని రైల్వేశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Also Read : Video : తెలంగాణలో టిడిపి చరిత్ర ముగిసిపోయిందా?

విశాఖ నగరం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చిరకాలంగా ఉంది. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర వాసులు జోన్ ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచే రాష్ట్రమంతా దక్షిణ మధ్య రైల్వే జోన్.. సౌత్‌ సెంట్రల్ పరిధిలో ఉంటే.. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు ఉత్తరాంధ్ర జిల్లాలు మాత్రం గతంలో కోల్‌కతా కేంద్రంగా ఉన్న ఆగ్నేయ.. సౌత్ ఈస్ట్రన్ రైల్వే జోన్‌లో.. తర్వాత ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌ కోస్ట్.. తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో కొనసాగుతున్నాయి. దీనివల్ల కొత్త రైలు సర్వీసులు, ఇతర అభివృద్ధి పనుల విషయంలో తీవ్ర వివక్ష ఎదురవుతోంది.

వాల్తేరు డివిజన్ తూర్పు కోస్తా రైల్వేకు ఆదాయం సమకూర్చడంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. దీని అభివృద్ధిపై వివక్ష చూపడం వల్ల విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కొన్ని దశాబ్దాల క్రితమే మొదలైంది. ఎట్టకేలకు రాష్ట్ర విభజన సమయంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు పుష్కర కాలం క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం 2019 బడ్జెట్‌లో దీనికి పచ్చజెండా ఊపి, ప్రత్యేకాధికారిని నియమించడంతో పాటు సరిహద్దుల వర్గీకరణ నివేదిక సిద్ధం చేయించింది. అలాగే విశాఖ నగరంలోని ఆరిలోవలో జోన్ ప్రధాన కార్యాలయ భవనం నిర్మాణం కూడా జరుగుతోంది. కానీ కొత్త రైల్వే జోన్ మనుగడలోకి రావాలంటే కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో తాత్సారం జరుగుతుండటంతో మళ్లీ ఉత్తరాంధ్ర వాసుల్లో అనుమానాలు, ఆందోళనలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను కలిసి రైల్వే జోన్ అంశం ప్రస్తావించారు. దాని ప్రభావమే ఇప్పుడు మళ్లీ జోన్ అడుగులు వేగం పుంజుకున్నాయి.

విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణాకోస్తా జోన్‌లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు చేర్చడంతో పాటు విశాఖ డివిజన్ కూడా ఉంటుంది. అయితే ఈ జోన్లలోని మార్గాలు, స్టేషన్లను పున:వర్గీకరించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉన్న 108 కిలోమీటర్ల రాయచూరు – వాడి రైలుమార్గం సౌత్‌ సెంట్రల్ జోన్ పరిధిలోనే ఉండిపోతుంది. ప్రస్తుతం గుంటూరు డివిజన్ పరిధిలో ఉన్న విష్ణుపురం – పగిడిపల్లి, విష్ణుపురం – జాన్‌పహడ్ మార్గాలు.. మొత్తం 142 కిలోమీటర్ల లైను ఎస్‌సీ రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ అవుతాయి.

Also Read : బ్రేకింగ్: టాలీవుడ్ లో పెళ్లి పీటలు ఎక్కనున్న స్టార్ కపుల్

అదే సమయంలో 46 కిలోమీటర్ల నిడివి కలిగిన మోటుమర్రి – కొండపల్లి మార్గం సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్‌లోకి వచ్చి చేరుతుంది. ఇలా మొత్తం డివిజన్ల వారీగా విభజన, సరిహద్దుల మార్పు చేర్పులకు తుది రూపమిచ్చి అధికారిక ప్రకటన చేస్తే కొత్త జోన్ పరిధి, సరిహద్దులపై పూర్తి స్పష్టత వస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. విజయవాడ డివిజన్‌లో 959 కిలోమీటర్లు, గుంతకల్లు డివిజన్‌లో 1,354 కిలోమీటర్లు, గుంటూరు డివిజన్‌లో 628 కిలోమీటర్లు, వాల్తేరు డివిజన్‌లో 1,106 కిలోమీటర్లు ఉండగా అందులో సుమారు 600 కిలోమీటర్ల రైల్వే మార్గాలను విశాఖ జోన్‌లో కలపనున్నారు. మొత్తంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి 3,500 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కొత్త జోన్‌కు సంబంధించి కీలకమైన నియామకాలను రైల్వే బోర్డు దశల వారీగా జరుపుకొస్తున్నది. వీటన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చి సాధ్యమైనంత వరకు ఈ నెలాఖరుకే విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించి అపాయింటెడ్ డేట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అన్ని సవ్యంగా జరిగితే.. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి రోజు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్.. సౌత్ కోస్టల్ రైల్వే జోన్.. S Co R.. జోన్ అందుబాటులోకి వస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ విషయంలో టీడీపీ...

అధికారంలో ఉన్నా.. లేకున్నా.. వైసీపీ నేతల...

ఆ సీటు ఎవరికి...

వైసీపీ ఓటమికి కారణాలేమిటి..? వైసీపీ ఓడిపోవడానికి...

బ్రేకింగ్: లిక్కర్ కేసులో...

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు విషయంలో...

బెజవాడ మేయర్ గా...

రాజకీయాల్లోకి ఎప్పుడు, ఎవరు, ఏ రూపంలో...

జగన్ ఢిల్లీ ప్రయత్నాలు...

2019 లో వైఎస్ జగన్ సిఎం...

బ్రేకింగ్: టాలీవుడ్ లో...

టాలీవుడ్‌లో ప్రముఖ నటులు రష్మిక మందన్న...

పోల్స్