అధికారంలో ఉన్న నేతలు “మేమే అధికారంలో కొనసాగుతాం” అని చెప్పడం భారత రాజకీయాల్లో సాధారణమే. ముఖ్యమంత్రులు మరో 10–15 సంవత్సరాలు తామే పదవిలో ఉంటామని ధీమాగా ప్రకటించడం కొత్త కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాజాగా 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని వ్యాఖ్యానించారు. ఈ ధీమాకు వెనుక ఉన్న రాజకీయ వాస్తవాలు గమనించాల్సినవే. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం అంతర్గత పోటీలు, వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతుంటాయి. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ తరహా కుమ్ములాటలు గణనీయంగా తగ్గినట్టు కనిపిస్తోంది. పార్టీలోని సీనియర్ నేతలు సైతం ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తూ, ప్రభుత్వ స్థిరత్వానికి సహకరిస్తున్నారు. అయితే ఇదొక్కటే ఆయన ధీమాకు కారణమని చెప్పలేం.
Also Read : కోడి పందాల జోష్.. ప్రభుత్వానికి భారీ ఆదాయం..
మరోవైపు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పరిస్థితి మరింత బలహీనంగా కనిపిస్తోంది. కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా పాల్గొనలేని స్థితిలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం ఇందుకు అనుకూలంగా లేదని ఆయనే పరోక్షంగా నిరూపించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పార్టీ బాధ్యతలు కేటీఆర్ చేతుల్లోకి వచ్చినప్పటికీ, బీఆర్ఎస్‌ను సమర్థంగా నడిపించడంలో ఆయన విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలకే పరిమితమవుతున్నారన్న అభిప్రాయం ఉన్నట్టే, రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడానికే ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించడంలో ఆయన వెనుకబడ్డారనే అభిప్రాయం బలపడుతోంది. అంతేకాదు, బీఆర్ఎస్‌లో హరీష్ రావు పాత్రపై కవిత పదేపదే చేస్తున్న హెచ్చరికలు పార్టీ అంతర్గత అస్థిరతను మరింత బయటపెడుతున్నాయి.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితిని మరింత స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. “ఆమె చేస్తున్న విమర్శలు, బయటపెడుతున్న అవినీతి ఆరోపణలే బీఆర్ఎస్‌ను ముంచడానికి చాలు; మేము అదనంగా విమర్శించాల్సిన అవసరం లేదు” అన్న ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సమీప భవిష్యత్తులో పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి గణనీయమైన ప్రయత్నాలు చేయకుండా, “అధికారంలోకి వస్తాం” అనే మాటలకే పరిమితమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ 3–4 స్థానాలకు పరిమితమవడం ఈ వాస్తవాన్ని స్పష్టంగా చూపిస్తోంది. అయినా కూడా పార్టీ నేతలు ఇదే ఆశావాదంతో ముందుకు సాగుతున్నారు.
Also Read : విజయసాయి కి ఈడీ నోటీస్: జగన్ అరెస్టుకు సన్నాహామేనా?
ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పూర్తి ఆధిపత్యాన్ని సాధించారని చెప్పవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఆయన స్థానంలో మరో నాయకుడిని నియమించే ప్రయత్నం చేస్తే, ఆ పరిస్థితిని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయంగా ఉపయోగించుకుని ప్రభుత్వానికి తీవ్రమైన ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం అధిష్టానంలో ఉంది. అందువల్లే ఈ రెండు పార్టీలను సమర్థంగా ఎదుర్కోగల నాయకుడు రేవంత్ రెడ్డేనన్న నమ్మకం కాంగ్రెస్ నాయకత్వంలో బలంగా ఉంది. ఈ రాజకీయ సమీకరణాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే, రేవంత్ రెడ్డి తన పదవిపై ధీమాగా మాట్లాడటానికి గల కారణాలు స్పష్టంగా అర్థమవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను తప్పించే సాహసం చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా లేదన్నది రాజకీయ వాస్తవం. అందుకే “మరో ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిని” అన్న ఆయన మాటలకు రాజకీయ బలం కనిపిస్తోంది.

