ఏపీలో రైల్వే సమస్యలపై రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి దృష్టి సారించారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో ఏపీతో పాటు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని రైలు అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి 6 నెలలు అయినా కూడా.. ఇంకా టెండర్లు పిలవలేదని జీఎం దృష్టికి ఎంపీ పురందేశ్వరి తీసుకొచ్చారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని 2027లో గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలిచి, మొదటి దశ పనులు వెంటనే ప్రారంభిస్తామని జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ హామీ ఇచ్చారు.
Also Read : చంద్రబాబుతో భేటీకి రేవంత్ నో..!
గోదావరి స్టేషన్, కొవ్వూరు స్టేషన్లలో టాయ్ లెట్స్ వంటి కనీస సౌకర్యాలు కూడా సరిగ్గా లేవని.. వెంటనే వాటిని మెరుగు పరచాలని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పుష్కరాలలోగానే పనులు పూర్తిచేయాలని ఎంపీ పురందేశ్వరి కోరారు. కరోనాకు ముందు వరకు కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో 18 రైళ్లు ఆగేవని, ఇప్పుడు 8 రైళ్లు మాత్రమే ఆగుతున్నాయన్నారు. ముఖ్యంగా చెన్నై, తిరుపతి వెళ్ళడానికి కూడా రైళ్లు ఆగడం లేదని, సింహాద్రి ఎక్స్ ప్రెస్ కూడా ఆపడం లేదని ఎంపీ పురందేశ్వరి ప్రస్తావించారు. ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన తిరుమల, సర్కారు, సింహాద్రి ఎక్స్ ప్రెస్ వంటి రైళ్లు ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా ముందు రాజమండ్రి నుంచి తణుకు, భీమవరం, నరసాపురం వరకు ప్యాసింజర్ రైళ్లు ఉండేవని.. కరోనా సమయంలో వీటిని ఆపేశారని.. వాటిని వెంటనే పునరుద్ధరించాలని ఎంపీ పురందేశ్వరి కోరారు.
Also Read : టీటీడీలో అది సాధ్యమేనా..?
కరోనా తర్వాత పునరుద్ధరించాలని చూసినప్పటికీ రాజమండ్రి నాల్గవ ఫ్లాట్ ఫారం పనుల కారణంగా నిడదవోలు నుంచి వెళుతున్నాయని అయితే రాజమండ్రి నుంచి యధావిధిగా మూడు ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరించాలని కోరారు. దీని వల్ల విద్యార్థులకు, ప్రయాణికులకు ఈ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎంపీ పురందేశ్వరి వివరించగా జీఎం సానుకూలంగా స్పందించారు. నిడదవోలు జంక్షన్‌లో 150 కోట్ రూపాయలతో ఎలక్ట్రిఫికేషన్ పనులు, ఫ్లాట్ ఫారం 4, 5 పనులు కూడా పూర్తయినా కూడా మెయిన్ లైన్‌లో కలపడానికి అవసరమైన 6 కోట్ల రూపాయలు విడుదల చేసి పనులు పూర్తిచేయాలని ఎంపీ పురందేశ్వరి కోరారు. కొవ్వూరు – భద్రాచలం రైల్వే ప్రాజెక్ట్ 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండడం, సర్వే జరిగినప్పటికీ పనులు పూర్తవ్వలేదన్న విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వాటా ఇవ్వాల్సి ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం వలన సత్తుపల్లి వరకు చేశామని.. ఏపీ ప్రభుత్వం కూడా ఇస్తే పూర్తి చేస్తామని జీఎం వివరణ ఇచ్చారు.