Sunday, July 12, 2026 11:37 AM
Sunday, July 12, 2026 11:37 AM

కూటమి ప్రభుత్వంలో పవన్ మాటే ఫైనల్..?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాపై అనుసరిస్తున్న విధానం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. గత ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రస్తావించిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, వ్యక్తిగత దూషణలపై కఠినంగా వ్యవహరించడం విశేషంగా మారింది. కొన్ని కేసుల్లో అత్యంత కఠిన చట్టాలను కూడా ప్రయోగించడంపై రాజకీయ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభావం ఉందా? అన్న ప్రశ్న రాజకీయ విశ్లేషణల్లో వినిపిస్తోంది.

Also Read : ఇవాళైనా పరువు కాపాడుకుంటారా..?

నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సాధారణంగా ప్రతి నిర్ణయాన్ని అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్తారనే పేరు ఉంది. అయితే నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని అంశాల్లో ఆయన తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకించి సోషల్ మీడియా కేసుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గతంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014 నుంచి 2019 మధ్య కూడా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ, అప్పట్లో పెద్ద ఎత్తున అరెస్టులు లేదా కఠిన చట్టాల ప్రయోగం జరగలేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు అదే అంశంలో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుండటంతో దాని వెనుక కారణాలపై చర్చ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన తొలి నెలల్లో సోషల్ మీడియా పోస్టులపై పెద్దగా స్పందించని ప్రభుత్వం, అనంతరం వరుసగా కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేపట్టడం ఏమిటని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా తనతో పాటు కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత ప్రభుత్వ వైఖరిలో మార్పు కనిపించిందని కొందరు విశ్లేషిస్తున్నారు.

Also Read : అంతా ఓపెన్.. రావణ్‌కు జగన్ మద్దతు..!

ఇటీవల యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసు ఈ చర్చను మరింత ముందుకు తీసుకొచ్చింది. అరెస్టు, అనంతరం కఠిన చట్టాల ప్రయోగం, బెయిల్ ప్రక్రియ చుట్టూ నెలకొన్న పరిణామాలు రాజకీయంగా పెద్ద దుమారానికే దారితీశాయి. ప్రతిపక్షాలు దీనిని ప్రభుత్వ అతిగా స్పందించిన చర్యగా విమర్శిస్తుండగా, అధికార పక్షం మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని సమర్థిస్తోంది. మరోవైపు, ముఖ్యమంత్రి తన బహిరంగ సభల్లో కూడా పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న వ్యక్తిగత దూషణలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ చర్యలను సమర్థించే ప్రయత్నం చేయడం రాజకీయంగా కొత్త సంకేతంగా కనిపిస్తోంది.

కూటమి ఐక్యతను బలపరచడంలో భాగంగానే ఈ వైఖరి ఉందని అధికార వర్గాలు చెబుతుండగా, పవన్ అభిప్రాయాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాలుగో విడత పాలనలో నిర్ణయాల వేగం, వ్యవహార శైలి గతంతో పోలిస్తే మారిందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ కఠిన వైఖరి ప్రభుత్వానికి రాజకీయంగా లాభిస్తుందా? లేక భావ ప్రకటనా స్వేచ్ఛపై మరింత చర్చకు దారితీస్తుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆ ముగ్గురి చుట్టూ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్...

కఫ్ సిరప్‌లపై కేంద్రం...

భారత్ లో ఆల్కహాల్ కలిగిన సిరప్‌లు,...

కొరియా స్టాక్ మార్కెట్‌ను...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి...

అంతా ఓపెన్.. రావణ్‌కు...

వైసీపీ ముసుగు తొలిగిపోయింది. యూట్యూబర్ ప్రశ్న...

దూకుడు పెంచిన కవితక్క.....

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.....

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా...

పోల్స్