స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించనున్నాయి. వచ్చే స్థానిక పోరులో అన్ని చోట్లా కూటమి అభ్యర్థులే గెలవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అధికార పార్టీకి స్థానిక ఎన్నికల్లో కొంత అనుకూలత ఉండటం సహజమే. అయితే ఈసారి మాత్రం కూటమి నాయకత్వం ‘సంపూర్ణ విజయం’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికల సమయంలో టీడీపీ బహిష్కరణకు దిగిన సందర్భాలు ఉండగా.. ఇప్పుడు అదే టీడీపీ స్థానిక పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు వైసీపీ మాత్రం ఫలితాలతో సంబంధం లేకుండా బరిలో నిలిచి తీరుతామని చెబుతోంది. దీంతో రాబోయే స్థానిక ఎన్నికలు కేవలం గ్రామ, మండల, జిల్లా స్థాయి ఎన్నికలుగా కాకుండా.. రెండు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ బలాబలాల పరీక్షగా మారే అవకాశం కనిపిస్తోంది.
Also Read : ఏపీ పర్యాటక రంగానికి కొత్త రెక్కలు.. కేంద్రం గుడ్ న్యూస్..!
కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు పూర్తికావస్తుంది. అంటే ఐదేళ్ల పాలనలో సగం దశకు చేరువలో ఉన్నట్టే. ఈ సమయంలో జరిగే స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయానికి ఒక రాజకీయ సూచికగా మారే అవకాశం ఉంది. ఇటీవల టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తరచూ సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని, ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత ఉందని చెప్పారు. అంతేకాదు.. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇక్కడే అసలు రాజకీయ లెక్క మొదలవుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
స్థానిక ఎన్నికల్లో వైసీపీ గణనీయమైన స్థాయిలో ఫలితాలు సాధిస్తే.. అది ఆ పార్టీకి కేవలం కొన్ని స్థానాల విజయం మాత్రమే కాదని టీడీపీ భావిస్తే, ఆ ఫలితాలు భవిష్యత్ రాజకీయాలకు సంకేతంగా మారే అవకాశం ఉంది. ఉదాహరణకు వైసీపీకి 30 – 40 శాతం స్థాయిలో స్థానిక ఫలితాలు అనుకూలంగా వస్తే.. ఆ పార్టీ తిరిగి వుంజుకుంటోందనే ప్రచారం ఊపందుకోవచ్చు. అదే సమయంలో కూటమి నేతల్లోనూ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వైసీపీకి ఏ మాత్రం బలం చేకూరినా.. దాని ప్రభావం స్థానిక ఎన్నికలకే పరిమితం కాకుండా 2029 రాజకీయాలపై కూడా పడొచ్చనే భయం కూటమి శిబిరంలో ఉందనే చర్చ సాగుతోంది.
మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఒక్క ఏకగ్రీవం కూడా జరగకుండా పోటీకి సిద్ధం కావాలని పార్టీ నేతలను ఆదేశించిన ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఫలితంగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాజకీయ పోరు మరింత తీవ్రం కానుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానిక ఎన్నికలు కేవలం టీడీపీ, వైసీపీ మధ్య పోటీ కాదు. అవి ప్రజలకు సంబంధించిన ఎన్నికలు. అధికార పార్టీకి అనుకూలంగా వచ్చినా, ప్రతిపక్షానికి అనుకూలంగా వచ్చినా.. ఆ ఫలితాల్లో ప్రజల తీర్పు ప్రతిబింబించాల్సిందే. వైసీపీ గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పు 2024లో ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయనే రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. అదే విధంగా అధికారంలో ఉన్నామనే ధీమాతో ప్రజాస్వామ్య విలువలను పక్కన పెడితే.. చరిత్ర పునరావృతం కావడానికి ఎక్కువ సమయం పట్టదనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.
సాధారణంగా అధికార పార్టీ స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి కూటమి లక్ష్యం 90 శాతానికి పైగా విజయాలు సాధించడమన్న స్థాయిలో ఉండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇంత భారీ విజయం సాధించాలనే పట్టుదల వెనుక.. కేవలం స్థానిక సంస్థలను చేజిక్కించుకోవాలనే లక్ష్యమే కాకుండా, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని రాజకీయంగా నిరూపించుకోవాలనే ప్రయత్నం కూడా ఉందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోతే.. అది వైసీపీకి కొత్త ఊపునివ్వడమే కాకుండా, అధికార కూటమిలోనూ రాజకీయ లెక్కలను మార్చే అవకాశం ఉంటుంది.
Also Read : పాదయాత్ర 2.O ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్..!
అధికారంలో ఉన్నప్పుడు ప్రజల తీర్పును ఎదుర్కోవడం ఏ పాలకుడికైనా కీలకమే. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే ప్రతి ఎన్నికా ఒక రకంగా ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుంది. అందుకే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు ఎన్ని స్థానాలు గెలిచారనే దానికంటే.. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని స్పష్టం చేసే రాజకీయ పరీక్షగా మారనున్నాయి. కూటమికి ఇది బలాన్ని నిరూపించుకునే అవకాశం.. వైసీపీకి పుంజుకుంటున్నామనే సంకేతం ఇచ్చే అవకాశం. అందుకే ఈసారి స్థానిక పోరు.. సాధారణ ఎన్నికలకంటే ముందే జరిగే ‘మినీ పొలిటికల్ వార్’గా భావిస్తున్నారు.

