అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రాన్ని గంటల వ్యవధిలోనే సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయక సిబ్బంది అలుపెరగక శ్రమిస్తున్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం రాత్రింబవళ్లు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తుఫాన్ ధాటికి ధ్వంసమైన మౌలిక వసతులను వేగంగా పునరుద్ధరిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Also Read : యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్..!
మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్న ఒక వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన సమయంలో కూడా వర్షంలో తడుస్తూ, కూలిపోయిన భారీ వృక్షాలను, విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్న పారిశుధ్య, విద్యుత్ సిబ్బంది దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. తుఫాన్ ధాటికి రాకపోకలకు ఆటంకం కలగకుండా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే రోడ్లను పునరుద్ధరించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ..మన నగరాలు, పట్టణాలు, గ్రామాలను అర్నాబ్ తుఫాన్ ప్రభావం నుంచి వేగంగా కోలుకునేలా చేయడం కోసం రాత్రింబవళ్లు అలుపెరగకుండా శ్రమిస్తున్న వేలాది మంది ప్రభుత్వ, అత్యవసర సేవల సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ #TogetherAgainstCycloneArnab హ్యాష్‌ట్యాగ్‌తో ప్రశంసించారు. విపత్తు సమయాల్లో సాధారణంగా గంటల తరబడి సేవలు నిలిచిపోతుంటాయి, కానీ ఈసారి కూటమి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో వేగంగా ఫలితాలు కనిపిస్తున్నాయి.
Also Read : పింఛన్లను అడ్డుకునేందుకు వైసీపీ సరికొత్త కుట్ర..?
ప్రాణాలకు తెగించి అర్ధరాత్రి వేళల్లో సైతం సేవలందిస్తున్న మున్సిపల్, పోలీస్, విద్యుత్, రెవెన్యూ సిబ్బంది నిబద్ధతకు ప్రజలు, నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుండటం వల్ల తుఫాన్ నష్టాన్ని తక్కువ సమయంలోనే అధిగమించడానికి వీలవుతోందని, క్షేత్రస్థాయి సిబ్బంది అందించే ఈ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని సర్వత్రా కొనియాడుతున్నారు.


